శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో.. సమతాకుంభ్ 2025 శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 09 నుంచి 19 వరకు ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతాయి..
మానవాళికి సమతా సందేశాన్నిస్తూ.. సమతాకుంభ్ 2025 ఆధ్యాత్మిక వేడుకలకు ముచ్చింతల్లోని శ్రీరామనగరం వేదికవుతోంది. భగవద్రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర! ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవారంభ స్నపనం, అంకురారోపణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
సమత.. మమత.. సార్వజనీనతకు నిలయమైన సమతా కుంభ్ మహోత్సవాలు చూసిన కన్నులు ధన్యం! పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో.. ప్రతీరోజూ విశేష కార్యక్రమాలుంటాయి.
ఫిబ్రవరి 10వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, 12వ తేదీ రామానుజ నూత్తందాది సామూహిక పారాయణము, 13న ఆచార్య వరివస్య, 15న శాంతి కళ్యాణ మహోత్సవం, 16న తేదీ ఉదయం వసంతోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, 18వ తేదీ రథోత్సవం-చక్రస్నాన ఘట్టాలు జరుగుతాయి.
పది రోజుల వేడుకల్లో నిత్యం..సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం, 18 దివ్యదేశ మూర్తులకు గరుడసేవ..ఇలా ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ శ్రీరామనగరం పరవశిస్తుంది.
శ్రీరామనుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జై శ్రీమన్నారాయణాయ అంటూ సమతా యాత్ర చేపట్టారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు.. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వరకు జరిగే సమతా యాత్రలో..శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగే ప్రతి ఘట్టం అద్భుతం..అనిర్వచనీయం! చరితకు, భవితకు వారధిగా.. శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలకు సాకేతపురి పలుకుతోంది శుభ స్వాగతం!!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..