మానవాళికి మానవతా సందేశాన్నిచ్చిన దివ్యమూర్తి..! భారతీయ తత్త్వ చింతనను విశ్వవ్యాప్తం చేసిన సమతా స్ఫూర్తి! అపర రామానుజులుగా..ప్రపంచానికి సమతను, మమతను పంచుతున్న అభ్యుదయ ఆధ్యాత్మికమూర్తి.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. మానవాళికి ఐక్యతా సందేశాన్ని అందించిన ఆ మానవతామూర్తి జీవితం ఆదర్శప్రాయం! రామానుజ మార్గంలో.. ఆ జగద్గురువులు అందిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం!
సమతా స్ఫూర్తి సందేశాన్ని ప్రపంచానికి అందించాలన్న సంకల్పంతో భగవద్రామానుజుల మహా విగ్రహ రూపకల్పన చేశారు. 216 అడుగుల సమతామూర్తి దివ్య విగ్రహం! ఆధ్యాత్మికంగానే కాదు..స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు్న్న సేవా కార్యక్రమాలు ఎన్నో జీవితాలు వెలుగులు నింపాయి. పేదలకు విద్య, వైద్య సౌకర్యాలతోబాటు.. పర్యావరణ పరిరక్షణకు స్వామీజీ చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో 108 దివ్యదేశాలను నిర్మించి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సమతాకుంభ్ 2025, 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఆలయాలు నాడు-నేడు అనే అంశంపై ఇష్టాగోష్టి నిర్వహించారు. శ్రీరామానుజుల వారి పాత్రపై విద్యార్థులతో ముఖాముఖి జరిగింది. హైదరాబాద్ మహానగరంలోని 15 విద్య సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానుజుల వారిపై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు.
అలాగే రామాయణం గురించి త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా అక్కడికి వచ్చిన చిన్నారుల దగ్గరి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ పలకరించారు. ప్రజ్ఞ విద్యార్థులతో రామాయణ సూపర్ మెమొరీ టెస్ట్ నిర్వహించారు. దేవాలయాలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానంలో ఉన్నాయని, మన వ్యక్తిత్వం, మన ఆలోచనలు మెరుగు పడాలంటే దేవాలయ సందర్శన అవసరమని చిన్న జీయర్ స్వామి అన్నారు. మన ముఖం ఎలా ఉందో తెలియాలంటే అద్దం కావాలి.. అదే విధంగా అద్దం లేకుండా మన ముఖం ఎలా ఉందో తెలియాలంటే ప్రతి రోజు దేవాలయంకు వెళ్లాలని చిన్న జీయర్ స్వామి సూచించారు. దేవాలయాలను వాణిజ్య సంస్థలు కొందరు మారుస్తున్నారని, అది మనం చేసుకున్న తప్పిదం అన్నారు చిన్న జీయర్ స్వామి. మనలోని లోపాలను దేవుడికి ఆపాదించడం మంచిది కాదన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..