చాలా ఇళ్లల్లో బియ్యం, పప్పులు నెలకు సరిపడా తెచ్చుకుంటారు. కొందరు ఏడాదికి సరిపడా కొని నిల్వ చేస్తారు. ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టి, తడి చేతులతో తాకకుండా జాగ్రత్త చేసినా కొన్నిసార్లు పురుగులు పడుతుంటాయి. కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే పప్పులు, బియ్యానికి పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు.
వేపాకులు
పురుగులను తరిమికొట్టడానికి వేపాకులు వాడటం ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది. పప్పులను పురుగుల నుంచి కాపాడటానికి ఇది బాగా పనిచేస్తుంది. పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఎండిన వేపాకులు ఉంచండి. ఇది కీటకాలు రాకుండా చేస్తుంది. పప్పులే కాదు, బీరువాలలో వేపాకులు పెడితే సిల్వర్ ఫిష్ పురుగులు బట్టలను పాడుచేయకుండా ఉంటాయి.
వెల్లుల్లి
పప్పుల డబ్బాలో పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి. పప్పుల పెట్టెలో 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉంచండి. అవి ఎండిపోయాక తీసి కొత్తవి పెట్టండి.
ఎండు మిర్చి
పప్పులు నిల్వ చేసే డబ్బాలో ఎండుమిర్చి వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి. డబ్బాలో 3 ఎండుమిరపకాయలు వేయండి. వాటి ఘాటుకు పురుగులు రావు.
లవంగాలు
లవంగాలు వంటకు రుచిని పెంచడమే కాకుండా, పప్పుధాన్యాలను పురుగుల బారి నుంచి కాపాడతాయి. పప్పులు నిల్వ చేసిన డబ్బాలో 8-10 లవంగాలు వేసిన చిన్న క్లాత్ బ్యాగ్ ఉంచండి. డబ్బా మూత గట్టిగా పెట్టండి. అదే విధంగా గాలి చొరబడకుండా చూడండి.
ఫ్రిజ్‌లో నిల్వ
ఫ్రిజ్‌లో స్థలం ఉంటే పప్పులను అక్కడ నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే పురుగుల నుంచి రక్షించడమే కాకుండా పప్పులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని గాలి చొరబడని డబ్బాలలో లేదా జిప్‌లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయవచ్చు.
ఎండలో పెట్టడం
పప్పులకు పురుగు పట్టినట్టు కనిపిస్తే వాటిని క్లాత్‌పై వేసి రెండు మూడు రోజులు ఎండలో ఉంచండి. చీకటి, చల్లటి ప్రదేశాలలో పురుగులు ఎక్కువగా వస్తాయి. ఎండలో ఉంచితే అవి పారిపోతాయి. పురుగులు పట్టకపోయినా నెలకు ఒకసారి ఎండలో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి.