ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవత్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న కేబినెట్ ఎక్సాపాన్షన్ సస్పెన్స్‌కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది.. ఈ అంశం ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కోర్టుకి చేరింది… ఒకటి, రెండు రోజుల్లో లిస్ట్ ఫైనల్ చేయడానికి ఢిల్లీలో వరుస మీటింగ్‌లతో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క . ఏడాది కాలంగా కేబినెట్ విస్తరణపై చాలా మంది సీనియర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం, మంత్రి వర్గ విస్తరణను మరింత కీలకంగా మారుస్తోంది. విస్తరణలో రేవంత్ మార్క్ తో పాటు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బెర్త్ కచ్చితంగా ఇస్తామని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారు. విస్తరణకు తోడు కొన్ని శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది.
కేబినెట్ బెర్త్‌లకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ప్రముఖంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావహులుగా ఉన్నారు. హైదరబాద్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా పరీశీలనలో ఉంది. ఆశావహుల్లో సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే బెర్త్ ఖరారు అయినట్లుగా చెబుతున్నారు.. ఇక బీసీల నుంచి మున్నురు కాపు సామజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు చాల బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో ఆది శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నారు. మొదటి నుంచి ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా మార్క్ ఉండటంతో ఆది శ్రీనివాస్‌కి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పట్టుబడుతున్నారు. అదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే అదే సామజిక వర్గం నుంచి ఇప్పటికే కేబినేట్ లో ఉన్న జూపల్లిని ఏం చేస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో ఇప్పుడు 4 బెర్త్‌లు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది…దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసి వేణుగోపాల్ సమావేశం
ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసి వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ లతో పీసీసీ కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించారు. మంత్రివర్గం కూర్పుపై కూడా అధిష్టానం అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గం ప్రకటించనున్నాని సమాచారం.. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో సామాజిక సమతౌల్యం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. మాదిగ, ముస్లిం, లంబాడా, రెడ్డి వర్గాలకు ఈ పదవులు ఇవ్వనున్నారు. పీసీసీ కార్యవర్గంలో 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది. అయితే కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్ ముఖ్య నేతల చర్చలలో మంత్రి వర్గంలో మార్పులపై ఎలాంటి సమాలోచన చేయలేదని సమాచారం అందుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసుల విషయంలో తొందరపాటుతనం లేదని.. చట్టప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. ఇక ఢిల్లీ టూర్‌లో భాగంగా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదన్నారు. తనకూ, రాహుల్‌కి ఎలాంటి గ్యాప్ లేదంటూ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు. మంత్రి పదవులకు తాను ఎవరి పేర్లను ప్రతిపాదించలేదని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..