జనగామ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకకాలంలో 31 మంది కలెక్టరేట్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ హాట్ చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆ నోటీసులు ఎందుకు జారీ చేశారో తెలుసా..? నోటీసులు జారీ చేసిన తర్వాత ఉద్యోగులు ఎలా పరుగులు పెట్టారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ప్రభుత్వ కొలువులు వచ్చేదాక ఒకలెక్క.. వచ్చిన తర్వాత మరోలెక్క.. సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై జనగామ జిల్లా కలెక్టర్ కొరడా ఝులిపిస్తున్నారు. రిజిస్టర్ల సంతకం పెట్టుకుని అడ్రస్ లేకుండా పోయిన అధికారులపై జిల్లా కలెక్టర్ తన మార్క్ తో పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా. సమయపాలన పాటించని ప్రభుత్వ అధికారులపై మొట్టికాయలు వేస్తున్నారు. ఇటీవల జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కలెక్టర్. అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన, రిజిస్టర్లలో సంతకం పెట్టుకుని పత్తా లేకుండాపోయిన అధికారుల గురించి ఆరా తీశారు.
సంకేతాలు పెట్టిఎక్కడకు వెళ్లారు.. ఎందుకు వెళ్లారని వివరాలు సేకరించిన కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై తన మార్కు చూపించారు. వివిధ విభాగాలలో కలిపి మొత్తం 31 మంది రిజిస్టర్ల సంతకం పెట్టుకుని పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లిన వారికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. సమయపాలన పాటించని అధికారుల పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం 10:30 లోపు ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా ప్రభుత్వ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. బాధ్యతగా వ్యవహరించాలని, సమయపాలన పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. వర్కింగ్ అవర్స్ లో వ్యక్తిగత పనులపై కోసం బయటికి వెళ్తే అనుమతి తీసుకుని వెళ్ళాలి తప్ప ఇష్టారాజ్యంగా బయటికి వెళ్తే వారి పైన కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కలెక్టర్ కొరడా ఝులిపిస్తుండడంతో అధికారులు, సిబ్బంది సోమవారం ఉదయం 10:30 గంటల కల్లా వారి వారి కార్యాలయాలకు చేరుకున్నారు. సాయంత్రం 5:00 వరకు చక్కగా వాళ్ళ విధులు నిర్వహించి ఐదు తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..