హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ తాజాగా తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) 2025 షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 10న తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 12 నుంచి మే 13 వరకు కొనసాగుతుంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎడ్‌సెట్ పరీక్ష జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్ సెట్‌తోపాటు పీఈసెట్ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. పీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12వ తేదీన విడుదలవుతుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమవుతుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 24వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుంది. జూన్ 11 నుంచి 14 వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష జరుగుతుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఆ రెండు ప్రవేశ పరీక్షల కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.
బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఎడ్‌సెట్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఎడ్) కోర్సుల్లో ప్రవేశానికి పీఈసెట్ నిర్వహిస్తారు. కాగా ఈసారి ఎడ్‌సెట్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం, పీఈసెట్‌ను పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తున్నాయి. ఈఏపీసెట్, ఐసెట్, పీజీఈసెట్ తరహాలోనే ఎస్సీ కేటగిరీలో గ్రూపుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అలాగే దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల సమర్పణకు ఒక్కో ప్రశ్నకు రూ.500 చొప్పున ఫీజు వసూలుతో సహా తదితర మార్పులు ఈ రెండు ప్రవేశ పరీక్షలకు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.