హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. జనవరి 17న ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది కూడా. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల మాస్టర్ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ షీట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి జనవరి 22వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రెటురీ డాక్టర్ ఇ నవీన్ నికోలస్ ఓ ప్రటనలో తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్సర్‌లను సరిచూసుకోవాలని సూచించారు.
అలాగే ప్రాథమిక జవాబు పత్రంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై సరైన అధారాలతో జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే నమోదు చేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను ప్రత్యేకంగా ఇచ్చిన వెబ్ లింకు ద్వారా ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే నమోదు చేయవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ కాకుండా ఇతర పద్ధతుల్లో ఇచ్చిన అభ్యంతరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరింబోమని స్పష్టం చేశారు. అలాగే గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన విజ్ఞప్తులను సైతం పరిగణించబోమని కమిషన్ సెక్రటరీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నిపుణుల కమిటీ వచ్చిన విజ్ఞప్తులను సరిచూసి తుది ఆన్సర్ కీ తయారు చేస్తారు. అనంతరం రెండు మూడు రోజుల్లో గ్రూప్ 2 ఫలితాలు కూడా వెల్లడిస్తారు.
కాగా గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 2 రాతపరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.