హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అధ్యాపకుల పోస్టులకు సంబంధించి ఇటీవల రాత పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జాబితాల్లో ఎంపిక చేసిన వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత సెంటర్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ షెడ్యూల్ జారీ చేసింది. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మోడల్ జూనియర్ బాలికల కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన జరింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ).. జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అధ్యాపకుల జాబితాను ఇంటర్ విద్యాశాఖకు తాజాగా అందజేసింది.
కాగా మొత్తం 1392 పోస్టులకు గానూ ఈ నియమక ప్రక్రియ కొనసాగుతుంది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా ఇన్నాళ్లు నియామక ప్రక్రియ నానుతూ వచ్చింది. కొన్ని పోస్టులపై కేసుల వల్ల అందరినీ కాకుండా కొందరికే ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. దీనిలో భాగంగా 1,288 మందికి జనవరి 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. దీని అనంతరం మరో 210 మంది డిగ్రీ అధ్యాపకులకు సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణఆదిత్య వెల్లడించారు. కోర్టు కేసుల అనతరం మిగిలిన జూనియర్ లెక్చరర్ అభ్యర్ధులకు కూడా ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మూడేళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన ప్రస్తుతానికి బోర్డుకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న జేఎల్‌లకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా 60 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.