తిరుపతి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కు తెరతీసింది. డిప్యూటీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు తెలుగుదేశం, నిలబెట్టుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం పొలిటికల్‌గా పీక్స్‌కు చేరుకుంది. వైసీపీ కార్పొరేటర్ల ఆస్తుల కుల్చివేతలు, మంత్రుల మంతనాలతో సీన్ రివర్స్ అయింది. పొలిటికల్ క్యాంపులో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కూటమి గూటికి దగ్గరవుతుండడంతో ఎల్లుండి అసలు ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్ నెలకొంది..!
క్యాంపులో కార్పొరేటర్లు..!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అటు అధికార కూటమికి ఇటు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు తమదంటే తమదన్న ధీమా టీడీపీ – వైసీపీ ల్లో నెలకొంది. కౌన్సిల్‌లో పూర్తి మెజారిటీ ఉన్న వైసీపీ గెలుపుపై పక్కా క్లారిటీగా ఉంటే, బలం లేని కూటమి కండువా మారుస్తున్న కార్పొరేటర్లతో పై చెయ్యి సాధించేందుకు సిద్ధంగా ఉంది. తిరుపతి కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నిక జరిగింది 49 డివిజన్లకు మాత్రమే. ఇందులో 48 డివిజన్లను వైసీపీ చేసుకోగా, ఒక్క డివిజన్ లో మాత్రమే టీడీపీ ఉనికిని చాటుకుంది.
ఆ తరువాత జరిగిన పరిణామాల్లో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేయడంతో కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా ఖాళీ అయిన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో తిరుపతిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సార్వత్రిక సమయంలో వైసీపీ కి చెందిన 5 మంది కార్పొరేటర్ల లో ముగ్గురు జనసేన, మరో ఇద్దరు టీడీపీ కండువా కప్పు కోవడంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో వైసీపీ ఓటమితో మరికొద్ది మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి దూరమయ్యారు.
కలిసొచ్చిన డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక
అయితే వాళ్లు ఏ పార్టీలోకి వెళ్ళిందుకు అవకాశం దక్కకపోగా ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక వాళ్లకు కలిసి వచ్చింది. ఇందులో భాగంగానే ఎల్లుండి జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 30కి పైగా కార్పొరేటర్ల బలం తమకుందని భావిస్తున్న వైసీపీ ఈ మేరకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. కార్పొరేటర్ ను జారిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీకి ఈరోజు చోటుచేసుకున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటించడం, డిప్యూటీ మేయర్ ఎన్నికను కూటమి ప్రభుత్వం సీరియస్ గా జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తిరుపతికి చేరుకున్నారు. ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందని మంత్రి కూడా ప్రకటించారు.
హీటెక్కిన పాలిటిక్స్
అయితే ఈ రోజు ఒక్కసారిగా తిరుపతిలో వాతావరణం వేడెక్కింది. డిప్యూటీ మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కార్పొరేటర్ శేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన భవనాల కూల్చివేత వ్యవహారం చర్చగా మారింది. అనుమతులు లేకుండా, నిషేధిత జాబితాలోని స్థలాల్లో జరిగిన కట్టడాలను పూర్తి చేసేందుకు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది రంగంలోకి దిగడంతో వైసీపీ అలర్ట్ అయింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన కార్పొరేషన్ దాదాపు 13 కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టగా అన్ని వైసీపీ సానుభూతి పరులవి కావడం తో పొలిటికల్ ఇంపార్టెన్స్ తెరపైకి వచ్చింది.
అక్రమ కట్టడాల కూల్చివేతతో..
మారుతి నగర్, తర్వాత ఇక్కడ ఖాదీ కాలనీలో కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న రెండు భవనాలకు అనుమతులు లేవని అక్రమ కట్టడాలని భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది సిద్ధం అయ్యింది. ఇందుకు నిరసనగా మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అరెస్టు కూడా అయ్యారు. అయితే మధ్యాహ్నం వరకు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితి ఆ తరువాత చల్లబడింది. అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు పనులను నిలిపివేశారు. సాయంత్రానికి వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి కూటమి నేతలకు అందుబాటులోకి వచ్చారు.
ఓటమి భయంతోనే ఇదంతా అంటున్న వైసీపీ.
ఇక కార్పొరేటర్ శేఖర్ రెడ్డి టిడిపిలో చేరడం ఖాయమని గుర్తించిన వైసీపీ వెంటనే అలర్ట్ అయింది. మరో కార్పొరేటర్ లడ్డు భాస్కర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇలా ఉదయం కుల్చివేతలు, సాయంత్రం మంతనాలు, రాత్రికంతా మారిన కండువాలుతో టెంపుల్ సిటీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారిపొగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు అవధులేక పోతున్నాయని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటిస్తే ఆయన ప్రవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్లను లొంగి పోయేలా కుట్రలు చేస్తున్నారన్నారు. గెలిచే సత్తా మెజారిటీ లేక, వైసీపీ కార్పొరేటర్ల కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి.
నెగ్గేందుకు కూటమి స్కెచ్.
మరోవైపు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయం తమదేనన్న భీమా కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరగా మరికొందరు టచ్ లో ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 ఓట్లు ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక లో విజయానికి కావలసిన 26 మంది తమవైపు ఉన్నారన్న ధీమాతో కూటమి పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరని ప్రకటించక పోయినా గెలుపు మాత్రం పక్కా అన్న పరిస్థితి కూటమిలో ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..