ఓ ప్రశంస ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.! ఓ అవార్డు అత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..! అందుకే మళ్లీ అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం. మనల్ని మనం ప్రోత్సాహిస్తూ ముందుకెళ్దామంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 అంటే.. తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా అవార్డుల ప్రదానం జరపాలని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు చాంబర్ సభ్యులు.
అవార్డులొక్కటే కాదు.. ప్రత్యేక జెండా రూపొందిద్దాం.! తెలుగు సినిమా పుట్టినరోజు ప్రపంచ సినిమాకు తెలిసేలా ప్రతి నటుడి ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఎగురవేయాలని నిర్ణయించారు.ఇక జెండా రూపకల్పన బాధ్యతను రచయిత పురుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. అలాగే అవార్డుకు ఏ పేరు పెట్టాలనే దానిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అవార్డులకు సంబంధించిన కమిటీ కూర్పు ఎలా ఉంటుంది.? అన్ని క్రాఫ్ట్స్‌కి చెందిన వారితో జ్యూరీ ఏర్పాటు చేస్తారా…? ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తారు…? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఏటా ఉగాదికి నంది అవార్డులు ఇవ్వడం దశాబ్దకాలం క్రితం వరకూ ఆనవాయితీగా ఉండేది. ఒకట్రెండు సార్లు వాయిదా పడ్డా.. ఆ తర్వాతి ఏడాదైనా పురస్కారాలు ప్రకటించి ఇచ్చేవారు. కానీ.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అవార్డుల అంశం పెండింగ్‌లో పడింది. పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలు రెండు రాష్ట్రాల CMలను కలిసినప్పుడు అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చినా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు ఇచ్చేవి ఎలాగూ ఇస్తాయి. మావాళ్లను మేమూ ప్రోత్సాహించుకోవాలి కదా అంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్‌లో పాల్గొన్న మురళీ మోహన్ అవార్డుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నటీనటులను ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓ మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు సెక్రటరీ దామోదర్ ప్రసాద్. సినీ పెద్దలను కలిసి తమ నిర్ణయాల్ని వివరిస్తామని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వాలు కాకుండా ఇండస్ట్రీ నుంచే అవార్డులివ్వడం దేశంలోనే తొలిసారిగా టాలీవుడ్‌లోనే అంటున్నారు సినీ ప్రముఖులు. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామంటున్నారు.!
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి