అమెరికాలో ఉన్నన్నాళ్లు ఒక రకం జీవితాన్ని గడిపారు భారతీయ అక్రమ వలసదారులు. అభద్రత, భయంతో కూడిన జీవితాన్ని వెళ్లదీశారు. అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలను భరించారు, సహించారు. అయితే ఇప్పుడు అమెరికన్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్నవాళ్లను భారత్‌కు తిరిగి పంపించే ప్రక్రియను షురూ చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.
అయితే భారత్‌కు తిరిగి వచ్చాక వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది. డాలర్ల వేటలో విదేశంలో చాలా కష్టాలు పడ్డారు. ఇక స్వదేశంలో వాళ్లు ఊపిరి పీల్చుకోవచ్చా? భారత్లో పెద్దగా సంపాదించలేకపోయినా, కావాల్సినంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉంటాయా..? అయితే వాళ్లు ఇక్కడ ఎలాగోలా హాయిగా బతికేయొచ్చనుకుంటే, అదంత ఈజీ కాదంటున్నారు నిపుణులు.
మెడికల్ స్క్రీనింగ్
ఈ అక్రమ వలసదారులు భారత్‌లో అడుగు పెట్టగానే చాలా రకాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే వాళ్లు ఇంటికి పోవడానికి వీలు ఉండదు. ఎయిర్‌పోర్టులోనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో వాళ్లకు అంటువ్యాధులు, తీవ్రమైన రోగాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్లను క్వారంటైన్‌కు తరలిస్తారు.
ఇమ్మిగ్రేషన్ ఇంటరాగేషన్
ఇక నెంబర్ 2..ఇమ్మిగ్రేషన్ ఇంటరాగేషన్. ఇది అత్యంత కఠినంగా ఉంటుంది. అమెరికాలోకి అక్రమంగా వెళ్లిన భారతీయులు.. అక్కడికి ఎలా వెళ్లారు. ఎందుకు వెళ్లారు వంటి ప్రశ్నలను అధికారులు సంధిస్తారు. ఇక అమెరికాలో వాళ్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తారు. అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా? సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై గుచ్చిగుచ్చి ప్రశ్నించే అవకాశముంది.
పాస్‌పోర్టు రద్దు.. బ్లాక్‌లిస్ట్ భయం!
ఈ ఇమ్మిగ్రేషన్ ఇంటరాగేషన్‌లో పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటారు. ఒకవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్లు, ఈ ఇంటరాగేషన్‌లో తేలితే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన కింద వాళ్ల పాస్‌పోర్టును రద్దు చేస్తారు. వాళ్లు ఇక విమానం ఎక్కడానికి కూడా వీలు ఉండదు. ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. ఎక్కడకు వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. దీనికితోడు వాళ్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. వాళ్ల మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్.. అంటే వాళ్ల నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది. వాళ్ల బ్యాంకు అకౌంట్లు సీజ్ అయిపోతాయి. దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు. భారత్లో కూడా ఉద్యోగాలు రావు. ఇలా అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..