ప్రపంచంలో పెళ్లికి దూరంగా ఉండే వారు ఉంటారేమో కానీ, ప్రేమలో పడని మనసు ఉండనే ఉండదంటారు. అంతలా ప్రేమ అనే ఫీలింగ్ మనసుని, కళ్లను కప్పేస్తుంది. ప్రేమించిన వ్యక్తి తప్ప మరో లోకం లేదన్నట్టుగా మనల్ని మార్చేస్తుంది. ప్రేమకు అంత శక్తి ఉంది. కానీ ఈ బట్టర్ ఫ్లై ఫీలింగ్ కేవలం కొద్ది రోజులే ఉంటుంది. మొదట ఏం చూసి అవతలివారిని అమితంగా ఇష్టపడ్డామో తర్వాత ఆ లక్షణాలే విసుగు తెప్పిస్తాయి. కలవకుండా, మాట్లాడుకోకుండా ఉండలేమనుకునే వారే విడిపోయేందుకు దారులు వెతుకుతుంటారు. కొన్ని సార్లు ఇవి విపరీత పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రేమోన్మాదులుగా మారడం వంటివి చూస్తూనే ఉన్నాం. మరి మీ బంధం ఎంత స్ట్రాంగ్ అనే విషయం మీరెప్పుడైనా చెక్ చేసుకున్నారా? .. లేదంటే ఓ సారి అవతలివారి విషయంలో ఈ ఫీలింగ్స్ మీలో ఉన్నాయో లేదో గమనించుకోండి..
ఆ ఇమేజ్ లేకున్నా లవ్ చేస్తారా?
నచ్చిన వ్యక్తితో జీవితాంతం కలిసుండాలనేది బంధం. అదే వ్యక్తిపై ఆకర్షణ మాత్రమే కలిగి ఉంటే అది మోహం. కానీ ఏ బంధమైనా దానికి పునాది ఆకర్షణే. ఈ స్టేజీని దాటిన తర్వాతే అసలైన ప్రేమ పుడుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మనసులో ఉన్న వ్యక్తితో ఎప్పుడూ ఉండాలనిపించడం సహజమే. వారు మీరు చదివే కాలేజ్ లో టాపర్ కావచ్చు లేదా ఆఫీస్ లో అందరికంటే అందమైన, తెలివైన వ్యక్తి కావచ్చు. అందరూ వారిని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉండొచ్చు. అలాంటి వారిని ఎవరైనా ఇష్టపడతారు. కానీ, ఇవేవీ లేకున్నా వారిని మీరు ఇంతే ఇష్టపడగలరా? వారి ఇమేజ్ కు ఏమాత్రం హాని కలిగినా మీ మనస్సు చివుక్కుమంటుందా? అయితే ఇది కేవలం ఇన్ ఫ్యాక్చువేషన్ మాత్రమే కావచ్చు.
క్షమించగలుగుతున్నారా?..
మీ భాగస్వామి ఏం చేసినా మీకు నచ్చుతుంది. మొదట్లో అందరికీ ఇలాగే ఉంటుంది. అయితే, వారి పొరపాట్లను, తప్పులను కూడా మీరు క్షమించగలుగుతున్నారా? అయితే అది ప్రేమే. ఇలా కాకుండా వారు చేసే పనుల వల్ల వారి మీద మీకు ఆసక్తి తగ్గుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే మీరు వెనక్కి తగ్గడం బెటర్. ఎందుకంటే ప్రేమంటే ఎదుటివారి లోపాలను కూడా ప్రేమించడమే కదా.
ఊహల్లోనే ప్రేమలు వద్దు..
ప్రేమలో మరో టైపు ప్రేమ ఇది. కొందరు తెలియని కారణంతో లోన్లీగా ఫీలవుతుంటారు. ఆ ఒంటరితనం నుంచి బయటపడలేకపోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా కాస్త నచ్చితే అదే ప్రేమని వారి ఊహల్లో మునిగి తేలుతుంటారు. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే మళ్లీ ఆ ఒంటరితనంలోకే వెళ్లాలేమో అనే భయం. వీరు నిజజీవితంలోకన్నా ఊహల్లోనే ఎక్కువగా బతుకుతారు. ఆ ఊహలకు తను ఇష్టపడుతున్న వ్యక్తికి మధ్య ఏమాత్రం పొంతన కుదరకపోయినా వారి మీద వెంటనే ఇంట్రెస్ట్ కోల్పోతారు. మీరు ఈ టైపు కాకపోతే మీది నిజంగా లవ్వే..
ఈ టెస్ట్ తో ఫుల్ రిజల్ట్..
మీది నిజంగా లవ్వా ఇన్ ఫ్యాక్చువేషనా తెలుసుకోవాలంటే మీరు ఈ పని కచ్చితంగా చేయాలి. అదేంటంటే.. ఆ వ్యక్తితో ఫోనులో కన్నా నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోండి. బయటి వారితో వారెలా మెలుగుతున్నారు. వారి కన్నా చిన్న స్థాయి వారితో వారి ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలు గమనించండి. ఇది మీ ఆకర్షణను కాస్త తగ్గించి మిమ్మల్ని రియాలిటీలో ఉండేలా చేస్తుంది. అప్పుడు మీ అసలైన ఫీలింగ్ ఏంటో మీకే తెలుస్తుంది. అప్పటి వరకు మీ గురించిన వ్యక్తిగత సమాచారం వంటివి పూర్తి స్థాయిలో వారితో పంచుకోకపోవడమే బెటర్.