మన ఇంట్లో జరిగే అనేక సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ కలహాలకు వాస్తు దోషాలు కూడా ఓ కారణం కావచ్చు. వాస్తు నియమాలను పాటించకుండా కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరు తెలిసీ తెలియక ఈ పొరపాట్లు చేస్తారు. కానీ దీని ప్రభావం వారిపై తీవ్రంగా పడుతుంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలని.. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో పెద్ద విగ్రహాలు వద్దు
వాస్తు ప్రకారం 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తున్న దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. అటువంటి విగ్రహాలను ప్రతిరోజూ సరైన విధంగా పూజించాల్సి ఉంటుంది. నియమ నిష్టలతో పూజలు చేయకపోతే కుటుంబానికి అనర్థాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఎప్పుడైనా పొరపాటున వీటికి పూజలు చేయడం మానేస్తే ఆ ఇంటి వృద్ధి దశదిశలా నశిస్తుంది. అందుకే పెద్ద విగ్రహాలను ఇంటికి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇంట్లో సాలిగ్రామం ఉంచకూడదు
సాలిగ్రామం నేపాల్‌లోని గండకీ నదిలో లభించే పవిత్ర రాయి. ఇది శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇంట్లో సాలిగ్రామాన్ని ఉంచినప్పుడు కఠినమైన నియమ నిష్టలను పాటించాలి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేయాలి. ఏదైనా లోపం జరిగినా అది కుటుంబానికి దురదృష్టాన్ని కలిగించవచ్చు. ఈ రాయికి సంబంధించిన అన్ని ఆచారాలను పాటించకపోతే జీవితంలో తీవ్ర కష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముళ్ళ చెట్లతో సమస్యలు
ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచడం వల్ల కుటుంబ సభ్యులకు అడ్డంకులు ఏర్పడతాయి. వారి జీవితంలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. ముళ్ళు మన జీవితానికి ప్రతీకగా మారి ప్రశాంతతను దూరం చేస్తాయి. ఇంట్లో ముళ్ళ చెట్లు ఉంటే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే గులాబీ మొక్క మాత్రం మినహాయింపు అని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం
ఇంట్లో శుభం, సౌభాగ్యం రావాలంటే వాస్తు శాస్త్రం చెప్పిన మార్గదర్శకాలను పాటించడం చాలా అవసరం. తెలిసీ తెలియక ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వాస్తు నిపుణుల సూచనలను పాటించి మంచి పాజిటివ్ ఎనర్జీని అందించే వస్తువులను మాత్రమే ఇంట్లో ఉంచడం మంచిది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)