రోడ్డుమీద పది రూపాయల నోటు కనిపిస్తేనే చాలామంది లటుక్కున వంగి అందుకుంటారు. ఎవరైనా చూశారా లేదా అని చుట్టూ చూస్తుంటారు. అలాంటిది ఓ ఐదు వందల రూపాయలు కనిపిస్తే.. జేబులో వేసుకోవాల్సిందే అనుకుంటారు. అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఈ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై రూ.500 నోటును చూసి జనం భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఓ వ్యక్తి రోడ్డుపై చేసిన ఫన్నీ ప్రాంక్ వీడియో ఇది. రోడ్డు మధ్యలో పసుపు, కుంకుమ పోశాడు. తర్వాత దానిపై రూ.500 నోటును పెట్టి, దానిపై నిమ్మకాయ కూడా పెట్టేశాడు. మొత్తం ఇలా సెట్ చేసి దూరంగా వెళ్లి కూర్చున్నాడు. దారిన వెళ్లే వారంతా కరెన్సీ నోటును చూసి దగ్గరికి రావడం కాదు కదా.. చూసీ చూడగానే భయపడి దూరంగా జరుగుతున్నారు. కొందరు నోటును చూసి ఆశ్చర్యపోయినా.. ఆ వెంటనే పసుపు, కుంకుమ, నిమ్మకాయను చూసి భయంతో దగ్గరికి వెళ్లేందుకు జంకారు. ఇలా దారిన వెళ్లిన వారంతా నోటు ఉన్న ప్రాంతాన్ని తొక్కకుండా దూరంగా వెళ్లిపోవడం కనిపించింది. ఇలా ఎంత సేపు ఎదురుచూసినా కూడా ఎవరూ ఆ నోటును తీసుకునే ధైర్యం చేయలేదు.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రజలపై మూఢనమ్మకాలు ఏమేరకు ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తానైతే ఆ నోటును తీసుకుని, నిమ్మకాయలతో జ్యూస్ చేసుకునేవాడిని అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి