ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 2: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. భక్తులంతా అక్కడి త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కూడా భక్తులు తరలివెళ్తున్నారు. జగిత్యాల నుంచి 8 మంది మహిళలతో పాటు వారి సమీప బంధువులైన నిర్మల్ జిల్లా కడెంనకు చెందిన నలుగురు మహిళలు మొత్తం 12 మంది బృందంగా జనవరి 27న కుంభమేళాకు ప్రైవేట్ బస్సులో వెళ్లారు. జనవరి 29 సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. సంగం ఘాట్ వద్ద వారు పవిత్ర స్నానాలు చేసేటప్పుడు వీరి బృందం రెండుగా విడిపోయింది.
ఈ క్రమంలో అందరూ స్నానాలు ఆచరించి బయటకు వచ్చే సమయంలో వీరిలోని నలుగురు మహిళలు అనుగుల బుచ్చవ్వ, బెల్లపు సత్తవ్వ, వీర్ల నరసవ్వ, ఆది రాజవ్వలు కనిపించకుండా పోయారు. జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన వీర్ల నర్సవ్వ, కొత్తవాడకు చెందిన ఆది రాజవ్వ, నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన అరుగుల బుచ్చవ్వ, బెల్లాల గ్రామానికి చెందిన బెల్లపు సత్తవ్వ తప్పిపోయినట్లు గుర్తించారు. వెళ్లిన వారంతా మహిళలే కావడం, తప్పిపోయిన వారి దగ్గర మొబైల్స్ లేకపోవడంతో వీరి ఆచూకీ దొరకకపోవడంతో అంతా కంగారుపడ్డారు. అక్కడి పోలీసులకు తెలపడంతో వారు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వీరి బంధువులు వెంటనే కుంభమేళాకు బయల్దేరి వెళ్లారు.
ఇంతలో పోలీసులకు తప్పిపోయిన మహిళల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ వెంటనే వివరాలను సేకరించి ప్రయాగ్‌రాజ్‌లోని ఉత్తరప్రదేశ్ పోలీసులతో సమన్వయం చేశారు. అధికారులు తప్పిపోయిన నలుగురు మహిళలను కనుగొని, వారు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా తప్పిపోయిన ఆ నలుగురు మహిళలను సురక్షితంగా శనివారం జగిత్యాల్‌కు తీసుకువచ్చి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎట్టకేలకు కుంభమేళాలో మిస్సైన మహిళలు తిరిగి ఇంటికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. సాయం చేసిన పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.