సాధారణంగా ఒక రోడ్డు వేస్తే ఒక ఐదేళ్లు, లేదా పదేళ్లు ఉంటుంది. కాంట్రాక్టర్ మంచి వాడైతే మరో ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వేసిన రోడ్లయితే కేవలం ఏడాది కాలం కూడా ఉండడం లేదనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వేసి 75 ఏళ్ళు గడిచింది. అయితే అందులో గొప్పేంటి అనుకుంటున్నారా..75 ఏళ్ళ క్రితం వేసినా ఇప్పటికి ఆరోడ్డు చెక్కు చెదరకపోవడమే ఇక్కడ గొప్ప విషయం. 75 ఏళ్ళు సంగతి పక్కన పెడితే మరో 25 ఏళ్ళు అయినా ఈ రోడ్డు చెక్కు చెదరదని అంటున్నారు అక్కడి స్థానికులు, వాహన దారులు. అయితే 75 ఏళ్ల క్రితం వేసిన ఆరోడ్డు ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
తమిళనాడు రాష్టంలోని శివగంగై జిల్లా కారైకుడి లో ఇడైయర్ వీధిలో సుమారు 75 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పటికి అలానే ఉంది. ఇడైయర్ వీధి బైపాస్ రోడ్డు జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవైన రోడ్డును 1949 లో వేశారు. అయితే నిర్మాణం చేపట్టి 75 ఏళ్ళు గడిచినా ఆరోడ్డు చెక్కు చెదరక పోవడానికి మాత్రం చెట్టినాడు సంప్రదాయ పద్దతిలో రోడ్డు వేయడమే అంటున్నారు.
చెట్టినాడు సంప్రదాయం.. ఎలా అంటే ఆవాలు, కరుప్పటి(తాటి బెల్లం లాంటిది) సున్నం లో కలిపి సహజ మిశ్రమాలతో వేయడమే చెట్టినాడు పద్ధతి. ఇలాంటి మిశ్రమాలు కలిపి వేసిన రోడ్లను తమిళనాడు లో సర్రి రోడ్లుగా పిలుస్తారు. 75 ఏళ్ల క్రితం ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ఇటీవల డ్రైనేజీ పనుల కోసం తవ్వెందుకు మున్సిపల్ అధికారులు సిద్ధం కాగా స్థానిక సామాజిక కార్యకర్తలు రోడ్డును తవ్వెందుకు లేదని నిరసనలు తెలుపడంతో వెనక్కి తగ్గారు. అయితే డ్రైనేజీ అవసరం కావడంతో రోడ్డు పక్కన మూడు చోట్ల గోతులు తవ్వి డ్రైనేజీ వసతి కల్పించారు.
ప్రస్తుతం ఈ రహదారిని తారు రోడ్లుగా మార్చేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోడ్డును సంప్రదాయ పర్యాటక రోడ్లుగా ప్రకటించాలని కారైక్కుడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 75 ఏళ్ల క్రితం వేసిన ఈ రోడ్డులో ప్రస్తుతం ఒక రోజుకు 100 కి పైగా భారీ టైర్లు కలిగిన లారీలు తో పాటు వందలాది వాహనాలు వెళ్తుంటాయని అయినా ఈ రోడ్డు నేటికి చెక్కు చెదరక పోగా మరో 25 ఏళ్ళు అయినా ఇలానే ఉంటుందని అంటున్నారు ఇక్కడి ప్రజలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి