న్యూఢిల్లీ, జనవరి 26: న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం (జనవరి 26) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో ఇరువురూ ‘సాంప్రదాయ బగ్గీ’లో రావడం విశేషం. ఈ పద్ధని 40 సంవత్సరాల తర్వాత 2024లో తిరిగి అనుసరించారు. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
కర్తవ్య పథంలో జరిగిన కవాతును దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత వాయిద్యాలతో కూడిన 300 మంది సాంస్కృతిక కళాకారుల బృందం ‘సారే జహాన్ సే అచ్ఛా’ వాయించారు. ఇక నేటి రిపబ్లిక్ వేడుకల్లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 31 శకటాలను ఇందులో ప్రదర్శించారు. వేడుకల్లో మొట్టమొదటిసారిగా, ట్రై-సర్వీసెస్ టేబుల్‌లో సాయుధ బలగాల మధ్య ఉమ్మడి, ఏకీకరణ స్ఫూర్తిని చూపేలా ‘శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ థీమ్‌తో త్రివిథ దళాల మధ్య నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే జాయింట్ ఆపరేషన్స్ రూమ్‌ను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే ‘ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ’తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరిగాయంటే..
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. గవర్నర్ జిష్ణుదేవ్ జాతీయజెండాను ఆవిష్కరించారు. వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ అమరులు స్తూపం దగ్గర నివాళులర్పించి రాజ్యాంగం గొప్పదనాన్ని చాటారు.
- విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయజెండాను ఆవిష్కరించారు. వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ హాజరయ్యారు
- గణతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జూబిలీహిల్స్‌లోని తన నివాసంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా సాగుదామని పిలుపునిచ్చారు.
- తెలంగాణ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయజెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
- ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏపీ హోంమంత్రి అనిత. తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం దగ్గర పూలు చల్లి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
- తెలంగాణ మంత్రి సీతక్క ములుగులోని తన క్యాంపు ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించి రాజ్యాంగం గొప్పదనాన్ని చాటిచెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
- తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల సందర్భంగా నర్సరీని మువ్వన్నెల జెండాతోపాటు ఎర్రకోట ఆకృతిలో అందంగా తీర్చిదిద్దారు. దేశంపై తనభక్తి చాటిన నర్సరీ నిర్వాహకుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.