ఐర్లాండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని NTR జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్, పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా గుర్తించారు. జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి సాయిబాబా జగ్గయ్యపేటలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల బిజినెస్ చేస్తున్నారు. సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు.. కార్లోలోని సౌత్‌ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. భార్గవ్ అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు. చెరుకూరి రామకోటయ్య, కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్ ఎమ్మెస్ చేసేందుకు ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు.
ఈ క్రమంలో చిట్టూరి భార్గవ్, చెరుకూరి సురేష్‌లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో కారు చెట్టును ఢీకొట్టడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. ఈ ఘటనలో భార్గవ్, సురేష్‌లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉన్నత చదువు కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై భార్గవ్ తండ్రి సాయిబాబాకు అక్కడ యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చింది. భారీగా మంచు కురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి