న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2013లో 33.95 శాతం ఉండగా 2024లో అది 54.81 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి సామర్థ్యం మెరుగుపడిందని ఆయన అన్నారు. శనివారం గాంధీనగర్‌లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్) యూత్ సమ్మిట్‌ను మంత్రి మాండవియా ప్రారంభించారు. బిమ్స్‌టెక్ దేశాల జనాభాలో 60 శాతానికి పైగా 35 ఏళ్లలోపు వారే ఉన్నారని, భారత్ నైపుణ్యం, వనరులు, దార్శనికతను అందించడం ద్వారా ప్రముఖ పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ దేశాలన్నీ సమిష్టి వృద్ధి, అభివృద్ధికి అవకాశాన్ని అందిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి భారత్ వివిధ చర్యలు చేపట్టిందన్నారు. 1.5 కోట్లకు పైగా యువత AI, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీలలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. వీరంతా స్కిల్ ఇండియా పథకం కింద భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవ నేపథ్యంలో గత దశాబ్దంలో దేశంలో గ్రాడ్యుయేట్ల ఉపాధి సామర్థ్యం 2013లో 33.95 శాతం నుంచి 2024లో 54.81 శాతానికి గణనీయంగా పెరిగిందని, ఇది ఉద్యోగ సంసిద్ధతలో 61 శాతం మెరుగుదలను సూచిస్తుందని ఆయన అన్నారు.
బిమ్స్‌టెక్ ఆర్గనైజేషన్‌లో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ సభ్యదేశాలు. ఈ దేశాల సహకారాన్ని ప్రోత్సహించడానికి, అనుభవాలు పంచుకోవడానికి, యువత సాధికారత, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాండవీయ మాట్లాడుతూ.. బిమ్స్‌టెక్ అంటే ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మాత్రమే కాదని, ప్రజలను అనుసంధానించడం, యువతకు సాధికారత కల్పించడం, ఉమ్మడి శ్రేయస్సు భవిష్యత్తును నిర్మించడం అని అన్నారు. ఈ ప్రయాణంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి దేశ యువతకు నైపుణ్యం, వనరులు మరియు దార్శనికతను అందిస్తుందని ఆయన అన్నారు. BIMSTEC దేశాల్లో దాదాపు 1.8 బిలియన్ల ప్రజలు ఉన్నారని, ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 22 శాతంగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ దేశాల మొత్తం GDP USD 4.5 ట్రిలియన్లు అని మాండవియా అన్నారు. అలాగే BIMSTEC కేవలం ఒక ప్రాంతీయ సమూహం కాదని, ఇది ఆర్థిక శ్రేయస్సు, భద్రత, స్థిరమైన అభివృద్ధికి ఓ ఉమ్మడి దార్శనికత అని ఆయన అన్నారు. సహకారాన్ని ప్రోత్సహించడం, అనుభవాలను మార్పిడి చేసుకోవడం, ఈ సభ్య దేశాల్లోని యువత నేతృత్వంలోని అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. గత దశాబ్దంలో భారతదేశం గణనీయమైన పరివర్తనను చూసిందని, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించిందని మంత్రి అన్నారు. 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడంపై దృష్టి సారించామని, దేశ వృద్ధి యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా నడపబడుతుందని ఆయన అన్నారు. ‘యూత్ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా-బిమ్‌స్టెక్ ఎక్స్ఛేంజ్’ ఇతివృత్తంగా ఈ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.