చిన్న వయసులోనే తన పరిస్థితిని అర్థం చేసుకొని ధైర్యంగా నిలబడింది. లాస్ ఏంజెలెస్‌లో నివాసం ఉంటున్న భారత కంటెంట్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా కొద్దిరోజుల క్రితం తన చిరకాల మిత్రుడిని వివాహం చేసుకుంది. ఆ ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. కారణం అందులో ఆమె గుండుతో కన్పించడమే..! అవును.. ‘అలోపేసియా’తో బాధపడుతున్న నీహర్.. విగ్గు వద్దనుకొని తన సహజరూపంలోనే పెళ్లి కూతురిగా ముస్తాబైంది. భారతీయ సంప్రదాయం ప్రకారం మనువాడింది. ‘బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ అంటూ నెటిజన్లు ఆమె ధైర్యానికి సలాం కొడుతున్నారు.
నీహర్ ఆరు నెలల వయసున్నప్పుడే ‘అలోపేసియా’ వ్యాధికి గురైంది. దీంతో చిన్న వయసు నుంచే తీవ్రమైన జుట్టు ఊడిపోయే సమస్యను ఎదుర్కొంది. అప్పుడప్పుడు ఆమెకు కొత్త జుట్టు వచ్చినా.. అది కూడా కొద్ది రోజులకే ఊడిపోయేది. అది కనబడకుండా ఉండేందుకు కొన్నేళ్ల పాటు విగ్గులు పెట్టుకునేది. దీంతో విసిగిపోయిన నీహర్.. చివరకు పూర్తిగా గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది.అలోపేసియా చాలా అరుదైన వ్యాధి.