తెలుగు తెరపై హాస్యాన్ని పండించిన దర్శకులలో జంధ్యాల స్థానం ప్రత్యేకం. అంతకుముందు సినిమాల్లో హాస్యం ఒక భాగంగా ఉండేది. హాస్యాన్నే ప్రధాన రసంగా తీసుకుని, నాన్ స్టాప్ గా నవ్వించిన దర్శకుడిగా జంధ్యాల పేరే అందరికీ గుర్తుంటుంది. జంధ్యాల తరువాత ఈవీవీ కొంతవరకూ ఆ మార్క్ ను కొనసాగించారు. ఇక ఆ ఇద్దరూ తనకి ఎంతో ఇష్టమని చెబుతూ వస్తున్న అనిల్ రావిపూడి, తన సినిమాల్లో కామెడీ ఫ్లేవర్‌ను జొప్పించి సక్సెస్ అవుతున్నాడు. జంధ్యాల సినిమాల్లో ప్రతి పాత్రకి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత నుంచే ఆయన కావాల్సినంత కామెడీ పంచేవారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో అనిల్ రావిపూడి అదే పద్ధతిని ఫాలో కావడం కనిపిస్తుంది. సాధారణంగా పల్లెటూళ్లలో కోడి పందాలు మాత్రమే కాదు, అత్తగారింట్లో అల్లుళ్ల మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. ఎదుటివారి వీక్ పాయింట్ పై కొట్టి, ఎవరికి వాళ్లు తామేంటో చూపించాలనే ఒక తపనతో ఉంటారు. ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. తనని ప్రేమించిన దామోదరరాజు గడ్డాలు పెంచుకుని ఉంటాడని మీనాక్షి భావించడం .. ఆమె బ్రేకప్ చెప్పిన 3 నెలలకే అతను భాగ్యాన్ని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలను కనడం .. గుర్తించడం లేదని జాబ్ ను వదిలేసినవాడు, మాజీ లవర్ కారణంగా తనని ఎక్కడ వదిలేస్తాడోనని కంగారుపడే భాగ్యం .. తానే మేధావినని ఫీలయ్యే జైలర్ .. ఇలా ఒక్కో పాత్ర ఒక్కో బలహీనతతో కనిపిస్తూ కామెడీని అందిస్తాయి. ఓటీటీ సినిమాలు చూసి పిల్లలు ఎలా ముదిరిపోతున్నారనేది కొసమెరుపు. మొత్తానికి ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో గట్టిగానే సందడి చేస్తోంది.