తాను చనిపోతూ నలుగురికి పునర్జన్మని ఇచ్చాడు ఓ యువకుడు.. ప్రమాదం లో బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. మరో ద్విచక్ర వాహనం ఢీకొని ఈ నెల 16 న తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు మహేష్ ని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేసిన కోలుకోలేదు.. చివరకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు.
అనంతరం వైద్యులు మహేష్ కుటుంబసభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ల సూచన మేరకు మహేష్ కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు.. దీంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి ఇద్దరికీ కిడ్నీలు, ఇద్దరికి కళ్ళు, ఒకరికి లివర్ మొత్తం ఐదుగురికి అవయవాలను దానం చేసి వారికి పునర్జన్మనిచ్చారు.
అనంతరం మహేష్ మృతదేహాన్ని స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ తీసుకురావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుట్టెడు దుఖం లో ఉండి కూడా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న మహేష్ తల్లిదండ్రులు జానకమ్మ, వీరాబాబును పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి
మరో ఎనిమిది మందికి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓ యువకుడికి బ్రెయిన్‌డెడ్ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. మోటకొండూరుకు చెందిన మల్గా నవీన్(36) అతని కుమారుడు తనీశ్‌తో కలిసి ఈనెల 12న గ్రామంలోని వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో మోటకొండూరు శివారులో విద్యుత్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం అయింది. వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 15న మృతి చెందాడు. నవీన్ అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దీంతో ఎనిమిది మందికి అవయవాలను దానం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి