తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం షురువైంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 25 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటింది. ఏకాభిప్రాయం కుదరని మరో 13 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్‌లో పెట్టింది. పార్టీ పరంగా వ్యవహారాల కోసం మొత్తం 38 జిల్లాలుగా తెలంగాణను విభజించి అధ్యక్షుడ్ని ప్రకటించడం బీజేపీలో ఉంది.
ఇక.. రాష్ట్రానికి కొత్త అధ్యకుడు వచ్చాక మిగతా జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే వారంలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఛార్జ్ శోభ కరంద్లాజే ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాక ఒకరిపేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం రాకపోతే అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, అదేవిధంగా జయశంకర్ భూపాల్‌పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు, హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్, నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి, జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబులను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.
కాగా, జిల్లా అధ్యక్ష పదవులకు శనివారం పలువురు నామినేషన్లు వేయగా.. అందులో కొందరు ఆదివారం తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. అయితే, పార్టీ వారి పేర్లను ఇంకా ప్రకటించలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా రాష్ట్రానికి కొత్త చీఫ్‌ను నియమించాలని పార్టీ భావిస్తోంది. ఆ తరువాత మిగిలిన జిల్లాలు, మండలాలకు అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులను కూడా నియమించే ఆలోచనలో ఉన్నారు.
ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ ఆధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అనేక మందితో చర్చించిన తర్వాత పార్టీ నాయకత్వం ఈటల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా నియమితులు అవ్వడం ఖాయమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.