ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా వేడుకలు 15 రోజులకు చేరుకున్నాయి. ఇక జనవరి 29 మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు అచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. అయితే ఈరోజు కోసమే ఎదురు చూస్తున్న నాగసాధువులు వేలాదిగా తరలివస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో.. ఎలా వస్తున్నారో తెలియదు.. ఏ రైల్వేస్టేషన్‌లో గానీ, ఏ బస్ స్టేషన్‌లో గానీ కనిపించడం లేదు. కానీ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే ఓ మిస్టరీగా మారింది.
ఇంతకీ ఎవరీ నాగ సాధువులు?నాగసాధువుల రూపం దిగంబరం.. దేహమంతా విభూతి.. చేతిలో ఆయుధం.. జడలు కట్టిన శిరోజాలతో ఎర్రటికళ్లతో భయానకంగా ఉంటారు. చీమకు కూడా అపకారం చేయరు. కానీ, ధర్మానికి అపచారం కలిగితే ప్రళయకాలరుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని వినడమే కానీ ప్రత్యక్షంగా చూసినవారు లేరు. పవిత్ర కుంభమేళా సమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకు వస్తారు. ఎంత నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్లిపోతుంటారు. శంకర భగవత్పాదులు దేశంలోని నాలుగు దిక్కులా బదరీనాథ్, పూరి, ద్వారకా, శృంగేరిల్లో పీఠాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగ సాధువులున్నారు. ఆధ్యాత్మిక జీవితంతో పాటు యుద్ధవిద్యల శిక్షణలో మాత్రం ఆరితేరి ఉంటారు.