గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతుంది. బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా అనంతపురంలో జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బాబీ మాట్లాడుతూ.. “అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. రాయలసీమ బాలకృష్ణ గారి అడ్డా. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతరలాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ గారు నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ గారి దగ్గర చోటు లేదు. మా నాన్న గారు మరణించక ముందు నేను బాలకృష్ణ గారిని కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఇలాగే ప్యూర్ హార్ట్ తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది అన్నారు.
అలాగే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. నా డైరెక్షన్ టీంకి, రైటింగ్ టీంకి పేరుపేరునా కృతఙ్ఞతలు. విజయ్ కార్తీక్ గారు విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అవినాష్ కొల్లా గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కి థాంక్స్. వేద అగర్వాల్ కి మంచి భవిష్యత్ ఉంది. నేను అభిమానిని కాదు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్ ని అయిపోయాను. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ లో బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను.” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.