మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పులుల భయం పట్టిపీడిస్తోంది. వారం రోజులుగా బెల్లంపల్లి ని పెద్దపులి చిరుతపులి భయం వీడటం లేదు. బెల్లంపల్లి పట్టణానికి అతి సమీపంలోనే కన్నాల అటవీ ప్రాంతంలో పులులు మాటు వేశాయి. నాలుగు రోజుల క్రితం అడవి పందిని చంపిన పెద్దపులి బీ -2 గా అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ఉంది. కన్నాల అటవీప్రాంతంలో పెద్దపులి సంచారిస్తూ ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో కన్నాల-బుగ్గ రహదారిపై నిషేధాజ్ఞలు విధించారు అధికారులు.
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులో నీ అటవీ ప్రాంతం నీటి కుంటలు, పత్తి చేన్లు పెద్దపులికి ఆవాసంగా మారాయి. అటువైపుగా ప్రజలు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కన్నాల బుగ్గ అడవుల్లో జంట పులుల యథేచ్చగా తిరుగుతున్నాయి. వారం రోజులుగా పెద్దపులి కన్నాల అడవుల లోనే మకాం వేసి ఉండటంతో సమీప గ్రామాల ప్రజలు ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని ఉండాల్సిందే. క్షణక్షణం, అనునిత్యం పెద్దపులి కదలికలు, అడుగుజాడలను తెలుసుకుంటూ ప్రజలు ఊపిరి పీల్చు కుంటున్నారు.
బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియా, కాల్‌టెక్స్ ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. దాంతో.. సమీప ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను బయటకు పంపవద్దని హెచ్చరించారు. మరోవైపు.. బెల్లంపల్లి పట్టణ ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే.. కన్నాలలోని బుగ్గ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. గత మూడు నెలలుగా కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతోంది.
పెద్దపులి కన్నాల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మకాం వేసి సంచరిస్తుండడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కన్నాల అటవీ ప్రాంతానికి సమీప గ్రామాలైన కన్నాల, లక్ష్మీపూర్, ఎస్సీ కాలనీ, బుగ్గ గూడెం,వరి పేట, అంకుశం, గోండుగూడెం, గాంధీనగర్, కుంట రాములు బస్తి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి చేనులోకి వెళ్లే రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్ళవద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తూ కన్నాల-బుగ్గ రహదారిపై నిషేధాజ్ఞలు విధించారు. అయితే వేటగాళ్ల నుంచి పెద్దపులిని రక్షించేందుకు 15 మందితో కూడిన ఎనిమల్ ట్రాకింగ్ టీంతో నిరంతరం అటవీ ప్రాంతంలో పులిని పర్యవేక్షిస్తున్నారు.