హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో శనివారం హమాస్ మరో నలుగురు బందీలను విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ 100 మందికి పైగా పాలస్తీనియన్లను విడిచిపెట్టనుంది. హమాస్ విడుదల చేసినవారిలో కరీనా అరీవ్, డానియెల్ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే నలుగు మహిళల ఉన్నారు. ఇందుకు ప్రతిగా 100 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ప్రస్తుతం విడుదలైనవారు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7న హమాస్ బంధించి తీసుకెళ్లింది. 477 రోజులుగా వారు ఆ గ్రూప్ చెరలోనే మగ్గిపోయారు.
తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి, రెడ్‌క్రాస్‌కు అప్పగించగా.. వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్తున్న వాహనం గాజాను వీడిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్.. అలాగే వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.