మహిళల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు మిస్‌యూజ్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ భార్యామణి తన భర్తపై వరకట్నం వేధింపులు కేసు పెట్టడంతో.. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే వాటిని మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి మరణించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ నితిన్ పడియార్ పై అతని భార్య రాజస్థాన్‌లో ఇటీవల వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నితిన్ జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు. తన భార్య రాజస్థాన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, ఆమె తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేశారని అందులో తెలిపాడు. తన భార్య పెట్టిన తప్పుడు కేసుల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం దానిని మార్చాలని ప్రభుత్వాన్ని కోరాడు.