కొంతమంది మనుషులు మృగాల కన్న హీనంగా వ్యవహరిస్తున్నారు.. ఇలాంటి వారిని చూస్తుంటే.. మనుషుల మధ్య ఉండడం కన్న.. అడవిలో ఉండడమే సేఫ్ అనిపిస్తోంది.. మొన్నటికి మొన్న మెదక్ జిల్లా మసాయిపేటలో మతిస్థిమితం లేని మహిళపై ఐదుగురు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే.. మళ్ళీ అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుస ఘటనలు చూసి అందరూ షాక్ కి గురి అవుతున్నారు.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మతి స్థిమితం లేని బాలిక అత్యాచారానికి గురైంది.. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి.. అభం శుభం తెలియని అమాయకురాలికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు..
హత్నూర మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులది రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం.. ఆ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు.. కాగా పదహారేళ్ల వయసున్న కుమార్తె తొమ్మిదో తరగతి వరకు చదివి బడి మానేసింది..తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనులకు వెళుతుండగా, బాలిక ఇంటి వద్ద ఉంటుంది..
ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంచుతున్నారు.. అయితే.. ఒంటరిగా ఉన్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు.. బయటకు పొక్కితే పరువు పోతుందేమో అన్న భయంతో ఆందోళన చెందుతున్నారు.. మానసిక దివ్యాంగురాలైన బాధితురాలు ఇప్పుడు ఏడు నెలల గర్భిణి… స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆశా కార్యకర్త, ఈ విషయాన్ని దౌల్తాబాద్ పిహెచ్‌సి వైద్యురాలికి తెలిపారు..
వైద్యురాలు వెంటనే జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. వారం రోజుల క్రితం బాలిక ఆమె తల్లిదండ్రులని సంగారెడ్డికి పిలిపించి జరిగిన ఘటనపై ఆరాతీశారు.. తాత్కాలిక వైద్య సేవలు అందించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గర్భం దాల్చడానికి ముగ్గురు కారణమని బాధిత బాలిక చెబుతున్నట్లు సమాచారం.. కాగా ఈ విషయాన్ని, గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుందాం అని కుల పెద్దలు సూచించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. వారు న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు..
బాలిక పై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా.. సామూహిక అత్యాచారమా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యతుల్ని గుర్తిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..