ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటింది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజన విషయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని పేచీ నెలకొంది. రాష్ట్రాలు, విభజన వ్యవహారాలపై నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర హోంశాఖ ఈ అంశంపై పలుమార్లు అనేక సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.
ఈనేపథ్యంలోనే సోమవారం (ఫిబ్రవరి 3న) కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన హైలెవెల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సహా రెండు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలని రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హితవు పలికింది. మొండిగా వ్యవహరిస్తే ఫలితం లేదని, కోర్టుకు వెళ్లినా జాప్యం తప్ప మరేమీ ఉండదని సుతిమెత్తగా మొట్టికాయలు వేసింది. తదుపరి సమావేశం నాటికి షెడ్యూల్ 9, 10లో పొందుపరిచిన సంస్థల విభజన విషయంలో లీగల్ ఒపీనియన్‌తో రావాలని, వాటి పంపకాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమన్వయం, ఏకాభిప్రాయం, పట్టువిడుపు ధోరణితోనే అపరిష్కృత అంశాలకు పరిష్కారం వెతకాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు.
పేచీ ఎక్కడ?
రాష్ట్రాల విభజన అన్నాక ఉమ్మడి ఆస్తులు, అప్పులను కూడా పంచుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించే క్రమంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన వంటి అంశాల్లో జనాభా దామాషా నిష్పత్తిని అనుసరించారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రకారం 58:42 నిష్పత్తిలో.. అంటే 58 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కు, 42 శాతం వాటా తెలంగాణకు దక్కేలా ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగులు, రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆస్తులు, రాష్ట్రం వెలుపల ఉన్న ఉమ్మడి ఆస్తులు, విద్యా సంస్థలు, ఉమ్మడి రుణాలు వంటి అనేకాంశాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపరిచి, వాటిని ఎలా విభజించుకోవాలో సూచించారు. ఈ ప్రకారం ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాలు, వాటిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉమ్మడి నిధులు వంటివన్నీ విభజించుకుని పదేళ్లుగా ఎవరికి వారు పరిపాలన చేసుకుంటున్నారు.
అయితే విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పొందుపరిచిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజన విషయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ రెండు షెడ్యూళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ వంటి పదుల కొద్ది సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా సంస్థల విభజన పూర్తయినప్పటికీ.. రెండు షెడ్యూళ్లలో పొందుపరిచిన సుమారు 20 సంస్థల విభజన విషయంలోనే పేచీ నెలకొంది. వివాదాస్పదంగా ఉన్న సంస్థల్లో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (MCR-HRI), తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి సంస్థలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం షీలా బెడె నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి విస్తృత సంప్రదింపుల తర్వాత కొన్ని సిఫార్సులు కూడా చేసింది. అయినా సరే.. రెండు రాష్ట్రాలు తమ వైఖరి విషయంలో మొండిపట్టుతో ఉన్నాయి.
చాలా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా ఉండడంతో వాటికి సంబంధించిన స్థిరాస్తులు సైతం తెలంగాణ భూభాగంలోనే ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ (EAP), కార్పొరేషన్లను విభజించే క్రమంలోనే పేచీ ఏర్పడుతోంది. ఆస్తుల్లో ఎక్కువ వాటా, అప్పుల విషయానికి వచ్చేసరికి తమకు సంబంధం లేదు అన్నట్టుగా రెండు రాష్ట్రాలు ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వైఖరిపైనే కేంద్ర హోంశాఖ అసహనంగా ఉంది. అందుకే హైలెవెల్ మీటింగ్‌లో పట్టువిడుపులు, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శించాలని హితవు పలికింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..