జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి. ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 10 కేంద్రప్రభుత్వ శాఖల శకటాలు ఉన్నాయి. ఈ రిపబ్లిక్‌డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఈ బొమ్మలతో ప్రత్యేకంగా ఓ శకటాన్ని రూపొందించారు. ఓ కళాకారుడు రూపొందించిన ఈ బొమ్మల సమూహం శకటంగా మారి ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీ పెరేడ్ లో ప్రదర్శన చేయబోతోంది. అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులు తయారు చేసిన లక్క బొమ్మల శకటాన్ని రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రదర్శించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ఓ శకటం రూపొందించింది. ఏటి కొప్పాక లక్క బొమ్మలకు శతాబ్దల చరిత్ర ఉంది. అంకుడు కర్రను ఉపయోగించి చేతితో బొమ్మలు తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత. వాటికి సహజ సిద్ధమైన రంగులు అద్ది లక్క పెట్టి ఈ బొమ్మలను తీర్చిదిద్దుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు గెలుచుకున్న ఈ బొమ్మల గురించి ఆయన మన్‌కీబాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017లో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేకత ఉంది. పర్యావరణహితంగా ఉండడంతోపాటు చిన్నపిల్లలు ఆడుకున్నా ఎటువంటి హాని చేయని విధంగా ఉంటాయి.