ఉదయం కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి గుండెజబ్బులతో మరణించే ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఉదయాన్నే కాఫీ తీసుకునేవారికి మాత్రమే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31 శాతం వరకు తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే రోజంతా అనేకసార్లు కాఫీ తాగేవారిలో ఇటువంటి ప్రయోజనాలు కనిపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది.
యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే ద్వారా దాదాపు పదేళ్ల పాటు 40,725 మంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. వారి ఆహారపు అలవాట్లను విశ్లేషించి కాఫీ తాగడం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు మరణానికి దారితీసే ఇతర కారణాలను పరిశీలించారు.
రాత్రి కాఫీ తాగడం వల్ల ప్రమాదమా..?
అధ్యయనంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తీసుకోవడం జీవ గడియారాన్ని (సర్కేడియన్ రిథమ్) భంగం చేసే అవకాశముందని.. దీనివల్ల మెలటోనిన్ వంటి హార్మోన్ల స్థాయిలు మారిపోతాయని వెల్లడించారు. ఇది రక్తపోటును పెంచడం, గుండె సంబంధిత సమస్యలు, శరీరంలో వాపు ఏర్పడేలా చేయడం వంటి ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి కాఫీ తాగే అలవాటు ఉన్నవారు దాన్ని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజంతా అనేకసార్లు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని చెప్పలేమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే, కాఫీని మితంగా తీసుకోవడం, ముఖ్యంగా ఉదయం పూటే తాగే అలవాటు చేసుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.