HMPV, RSV వైరస్ లు ఒకటేనా..?
HMPV, RSV రెండు శ్వాసకోశ వైరస్‌లు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు రెండింటిలోనూ కనిపిస్తాయి. ఈ రెండు వైరస్‌లు ఒకే కుటుంబానికి చెందినవి. ఇంచుమించు ఒకటే లక్షణాలు ఉన్నప్పటికీ.. అవి వచ్చే కాలం, తీవ్ర అనారోగ్యానికి చికిత్స విధానాలలో తేడాలు ఉన్నాయి.
HMPV అంటే ఏంటి..?
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ ఒక శ్వాసకోశ వైరస్. తేలికపాటి జలుబుతో పాటు బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇది ప్రమాదకరం.
ముక్కు కారటం, జ్వరం, గొంతు నొప్పి HMPV లక్షణాలు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా విశ్రాంతి, గ్లూకోజ్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే కోలుకోవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు లేదా నిరంతర ఊపిరితిత్తుల వ్యాధులు ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయాలలో తప్పకుండా ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం, నిరంతర అధిక జ్వరం గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
RSV అంటే ఏంటి..?
రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముక్కు కారటం, దగ్గు, శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. నవజాత శిశువులలో, వృద్ధులలో బ్రోన్కియోలిటిస్, న్యుమోనియా వంటి సమస్యలు వస్తాయి. శిశువులకు RSV రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో వారి చిన్న ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి ఈ వైరస్ సోకకుండా చూసుకోవాలి.
HMPV, RSV మధ్య తేడాలు ఏంటి..?
లక్షణాలు
దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటి జలుబు లాంటి లక్షణాలు HMPV, RSV వల్ల వస్తాయి. జ్వరం ఈ వైరస్‌ల ప్రభావానికి సంకేతం. HMPV సోకిన వ్యక్తులకు RSV ఉన్నవారి కంటే జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ.
అధిక వ్యాప్తి కాలం
HMPV, RSV వైరస్ లు ఎక్కువగా చలి కాలంలో బాగా వ్యాపిస్తాయి. జలుబు చేసినప్పుడు RSV పెరుగుతుంది. ఇది సాధారణంగా ఏడాదిలో అక్టోబర్, నవంబర్ నెలలలో మొదలవుతుంది. HMPV వైరస్ జలుబు చేసినప్పుడు సాధారణంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఏడాదిలో ఏప్రిల్, మే నెలల ప్రారంభంలోనూ కనిపిస్తుంది.
ప్రసారం
HMPV, RSV వైరస్ లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బయటకు వచ్చే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ముఖాన్ని తాకడం ద్వారా లేదా వైరస్ సోకిన వారిని ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి.
ప్రమాద కారకాలు
శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులకు ఈ రెండు వైరస్ లు సోకే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. నవజాత శిశువులు RSVకి గురయ్యే అవకాశం ఎక్కువ.
రోగ నిర్ధారణ
లక్షణాల కోసం చూడటమే కాకుండా పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్ష HMPVని నిర్ధారించడానికి సహాయపడుతుంది. RSV విషయంలో వైద్యుడు శారీరక పరీక్ష సమయంలో లక్షణాలను తనిఖీ చేస్తారు. RSV కోసం రక్త పరీక్షలు చేయవచ్చు. ఊపిరితిత్తుల వాపు ఉందో లేదో తనిఖీ చేయడానికి ఛాతీ ఎక్స్-రే తీస్తారు. నోరు, ముక్కు లోపల నుండి స్రావాల స్వాబ్ సహాయంతో వైరస్ ఉనికి కోసం తనిఖీ చేస్తారు.
చికిత్స
ఈ వైరస్‌లకు ప్రత్యేకమైన యాంటీవైరల్ లేదు. HMPV, RSV చికిత్స సహాయకారిగా ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో హైడ్రేషన్, జ్వరం నియంత్రణ, ఆక్సిజన్ థెరపీపై దృష్టి ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో శరీరానికి శక్తి కోసం ద్రవపదార్ధాలను నాళాల ద్వారా పంపిస్తారు. కార్టికోస్టెరాయిడ్స్ శరీరంలో మంటను తగ్గిస్తాయి. తీవ్రమైన RSV విషయంలో ముఖ్యంగా ప్రమాదకర నవజాత శిశువులలో పాలివిజుమాబ్ వంటి మోనోక్లోనల్ యాంటీబాడీలు సహాయపడతాయి. యాక్టివ్ RSV ఇన్ఫెక్షన్ చికిత్స కోసం రిబావిరిన్ ఇస్తారు.
నివారణ
HMPV, RSV రెండింటినీ నివారించడానికి దగ్గుతున్నప్పుడు నోటిని కప్పుకోవడం, చేతులను కడుక్కోవడం, ఉపరితలాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత పాటించాలి. తలుపు నాబ్‌లు, టేబుల్‌లు, ఎలక్ట్రానిక్స్ శుభ్రంగా ఉంచాలి. అనారోగ్యానికి గురైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండాలి.