ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఈ ర్యాంకుల్లో 8,9 ర్యాంకులు సాధించిన లోకేష్, పవన్ కల్యాణ్‌కు అభినందనలు అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు. దీంతో ఈ అంశంపై రాజకీయం మొదలైంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమీ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బుకాయిస్తున్న తీరును జగన్ ప్రజల ముందుంచారన్నారు. హామీలు అమలు చేయలేక ఇంకా జగన్నే విమర్శిస్తున్నారన్నారు. అధికారం కోసమే అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చారన్నారు. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు కారుకూతలు కూస్తున్నారన్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కూటమి నేతలకు ఉందా.. ? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించడం సాధ్యం కాదని.. అది తన అభిప్రాయం మాత్రమేనని అంబటి పేర్కొన్నారు. పట్టణాలను నిర్మించడం కంటే అసెంబ్లీ, సచివాలయం,కోర్టులు కట్టుకోవడం మంచిదేనని.. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామా లేదా అన్నది చర్చించి చెబుతామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
అంబటికి కౌంటర్..
అంబటి రాంబాబుకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. 8, 9 వ స్థానాల్లో ఉన్న లోకేష్, పవన్ తమ ర్యాంకులను మెరుగుపర్చుకుని 1, 2 వ స్థానాలకు రావడానికి కృషి చేస్తున్నారని అన్నారు బుద్దా వెంకన్న. ప్రస్తుతం 11 స్థానాలతో ఉన్న జగన్.. వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం కోసం మరింత కృషి చేస్తున్నారన్నారు.
ఇతర శాఖలకు సంబంధించిన ఫైల్స్ కూడా పవన్ కల్యాణ్, లోకేష్ దగ్గరకు వస్తున్నాయని.. అందుకే వారి దగ్గరకు ఫైల్స్ అంత తొందరగా క్లియర్ కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కేవలం వాళ్ల శాఖల ఫైల్స్ మాత్రమే వారి దగ్గరకు వెళితే.. ఆ ఇద్దరే నంబర్‌వన్‌గా ఉంటారని అన్నారు.
స్పందించిన చంద్రబాబు..
మరోవైపు ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. టీమ్ వర్క్‌గా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని.. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయొచ్చని ట్వీట్ చేశారు. అందుకే ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు ఇచ్చామని చెప్పారు. ఎవరినీ తక్కువ చేయడానికి ఈ ర్యాంక్‌లు ఇవ్వలేదన్నారు. ఇది పాలనలో వేగం పెంచే ప్రయత్నమన్నారు. తన స్థానాన్ని కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నారు. మంత్రులు శాఖల్లో మంచి ప్రతిభ చూపించాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..