ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి కీలకమైన ఖనిజాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని తొలగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించడంతో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సరసమైన ధరకు అందుబాటులోకి రానున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు, సంబంధిత రంగాల స్థానిక తయారీని పెంచడానికే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కీలకమైన చర్యలను తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, స్క్రాప్, సీసం, జింక్ మరియు ఇతర పన్నెండు కీలకమైన ఖనిజాల పై బీసీడీ నుంచి పూర్తి మినహాయింపును ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైన బ్యాటరీ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం తాజా నిర్ణయంతో బ్యాటరీ తయారీ ఖర్చులు తగ్గి ఎలక్ట్రిక్ వాహనాలు మరింత తక్కువ ధరకే వినియోగదారులకు అందుతాయని నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలో బ్యాటరీలు, బ్యాటరీ సెల్లను ఉత్పత్తి చేయడంలో చురుకుగా పనిచేస్తున్న టాటా మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, లాగ్9 మెటీరియల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి వాటితో స్థానిక ఉత్పత్తిదారులకు కేంద్రం చర్యలు మరింత ప్రోత్సాహకంగా మారనున్నాయి. భారతదేశంలో బ్యాటరీలకు ప్రధాన సరఫరాదారులుగా కొనసాగుతున్న చైనా, దక్షిణ కొరియాతో సహా ఇతర మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి స్థానిక తయారీ ఊతం ఇవ్వడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశానికి సంబంధించిన బ్యాటరీ రీసైక్లింగ్, తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి బడ్జెట్ 2025 కీలకంగా మారుతుందని వివరిస్తున్నారు.
బ్యాటరీ రీసైక్లింగ్, ఈవీ సరఫరా విషయాల్లో పెట్టుబడిని పెంపొందించడంతో పాటు ఈవీ మొబైల్ బ్యాటరీల తయారీ పెరుగుతుందని తద్వారా స్థానికులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈవీ బ్యాటరీ రంగం ప్రధానంగా పన్ను మినహాయింపు నుంచి ప్రయోజనం పొందుతుంది. ముఖ్యంగా కేంద్రం చర్యల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైనవిగా మారతాయి. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులు, టెయిల్ పైప్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేలా చేయడానికి కీలక అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. 2030 నాటికి దేశంలో మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం ఈవీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి