బడ్జెట్‌పై తెలంగాణలో మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తుంటే.. వాటిని తిప్పి కొడుతున్నారు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు. ఇది ప్రజారంజక బడ్జెట్ అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ. ఇన్‌కమ్ టాక్స్ రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. అన్నివర్గాలకు సమన్యాయం చేసే డ్రీమ్ బడ్జెట్ ఇది అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని, సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయం అన్నారు కిషన్ రెడ్డి. దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ ఇది అన్నారు మరో కేంద్రమంత్రి బండి సంజయ్. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలంటూ బండి సంజయ్ సూచించారు..
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. నిర్మలా సీతారామన్ తెలుగు కోడలు అయి ఉండి.. తెలంగాణపై ప్రేమ చూపలేదని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని చెప్పారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణ కేంద్రమంత్రులు కోతలే కానీ.. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా బడ్జెట్ ఉందన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. సంక్షేమ రాజ్యాన్ని పన్నుల రాజ్యంగా మార్చారని ఆరోపించారు.
బిహార్ బడ్జెట్‌లా ఉంది..
ఇది బిహార్ బడ్జెట్‌లా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారని, ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా అని ప్రశ్నించారు హరీష్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..