Cinema tree: చిగురిస్తున్న ఆశలు.. సినిమా చెట్టుకు మళ్లీ ఇగుర్లు..!

2 hours ago 1

మనిషిని ఆశ బతికిస్తుందంటారు. ఆశ లేని జీవి ఉన్నతిని సాధించటం కూడా సాధ్యం కాదు. అన్ని సుఖాలను వదులుకుని సన్యాసం స్వీకరించిన వారికి సైతం భగవంతుడిని చేరుకోవాలనే ఆశ ఉంటుంది. అందుకే మనిషి చివర వరకు ఆశను కోల్పోకూడదంటారు. కేవలం మనిషి మాత్రమే కాదు సృష్టిలో చెట్లు సైతం ఇదే స్పష్టం చేస్తుంటాయి. గాలికి ఎగురుతూ వచ్చిన ఒక బీజం కఠినమైన రాయిపై పడినా పరిమతమైన వనరులతో అది మొక్కగా మొలిచి మానుగా ఎదుగుతుంది. ఇది ఇప్పటికి సజీవ సాక్ష్యంగా మన కంటికి సినిమా చెట్టు రూపంలో కనిపిస్తున్న సత్యం.

గోదారి గట్టు మీద ఉన్న సినిమా చెట్టు మళ్లీ చిగురిస్తోంది. తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన 150 ఏళ్ల సినిమా చెట్టు మళ్లీ చిగురుస్తుందని ఆశతో కుమారదేవం వాసులు ఎంతగానో మురిసిపోతున్నారు. తమ ఊరికి అత్యంత ప్రాధాన్యత తెచ్చి పెట్టిన ఈ చెట్టు మళ్లీ చిగురుస్తుందని ఊళ్లో ఎక్కడ చూసినా జనాలు సంతోషంతో చెప్పుకుంటున్నారు. గోదావరి వరదల కారణంగా గట్టు కోతకు గురికావడంతో ఈ చెట్టు ఇటివల కూలిపోయింది. ఈ ఘటన కేవలం కుమారదేవం ప్రజలకు మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రముఖులను సైతం దిగ్భాంతికి గురి చేసింది.

ఎందుకంటే గోదావరితో అనుభంధం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా చెట్టుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభంధం పెనవేసుకుంది. అందుకే ఇది కేవలం ఒక నిద్ర గన్నేరు చెట్టుగా మాత్రమే కాదు సినిమా చెట్టుగా అవతరించింది. ఒక చెట్టుకు రక్షణ కావాలంటే అక్కడ అక్కడ ఒక దేవుడి విగ్రహం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే సెంటిమెంట్‌తో ఎవ్వరూ ఆవిగ్రహాన్ని కదిలించారు, చెట్టును తొలగించారు. కాని ఇలాంటి వాదనలకు భిన్నంగా వెండితెర మీద ఆకుపచ్చగా విరిసిన వృక్షరాజంను కాపాడాలని అటు అధికారులు, ఇటు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి.

మళ్లీ చిగురిస్తే తమ ఊరికి పూర్వ వైభవం వస్తుందని గ్రామస్తులు అంతా ఆశించారు. ఎన్నో సంవత్సరాలుగా నీడను పంచిన నిద్ర గన్నేరు చెట్టు శాశ్వతంగా నిద్ర పోయిందన్న విషాద వార్త మరికొద్ది రోజుల్లోనే చెరిగిపోనుంది. ఏ గోదారి గట్టు మీద అయితే సినిమా చెట్టు ఒరిగిపోయిందో తిరిగి అక్కడే మరో వందేళ్ల పాటు బ్రతకడానికి చిగుళ్ళను తొడుక్కుంటుంది. తరతరాలకు నీడను పంచి ఊరి జనాలతో మమేకమైన ఈ చెట్టు మళ్లీ లేలేత చిగుళ్ళతో ఊపిరి పోసుకుంటుంది.

ఈ సినిమా చెట్టు బ్రతికించడానికి చేస్తున్న ప్రయోగాలలో రాజమహేంద్రవరం రోటరీ సభ్యుల కృషిని మనం కొనియాడాలి. రోటరీ సభ్యులు చెట్టు మానులను కట్ చేసి రసాయన ప్రక్రియ ద్వారా ఈ చెట్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఈ రసాయన ప్రక్రియకు 50 రోజుల సమయం పడుతుందని తొలుత అందరూ భావించారు. అయితే కేవలం 30 రోజుల్లోనే చెట్టుపై చిన్న చిన్న చిగురులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న లేత లేత పిలకలను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశిస్తున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్న ఈ చెట్టు, 150 సినిమాలకు వేదికైన ఈ మహావృక్షం కూలగానే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్నవారు సైతం విలవిల్లాడిపోయారు. ప్రస్తుతం ఇది వివిధ చికిత్సల ఫలితంగా పునర్జీవం పోసుకుంటుంది.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని ఈ సినిమా చెట్టు వేరు నుండి రెండుగా చీలిపోయి గత ఆగస్టు నెలలో గోదావరిలోకి పడిపోయింది. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారు తక్షణమే స్పందించి చెట్టు పడిపోయిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వెనువెంటనే ఆ చెట్టు బతికేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టారు. అనంతరం చెట్టు వేర్లు, కొమ్మలు కత్తిరించే ప్రక్రియ ప్రారంభించారు. చెట్టుకు సంబంధించి వివిధ ప్రదేశాలలో పలు రసాయన మిశ్రమాలను అద్దారు. అవి పూసిన తరువాత గాలి, ధూళి తగలకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కాండం కొమ్మల భాగాల్లో ఆకుపచ్చని ఆకులతో పచ్చని చిగుళ్ళు ఏర్పడ్డాయి. మరో నెల రోజుల్లో సినిమా చెట్టు యేపుగా పెరిగే పరిస్థితి అయితే నెలకొంది.

చెట్టు గోదావరి గట్టును చేర్చి ఉండటం, ఆ ప్రదేశం కొద్దికొద్దిగా కోతకు గురవడం, ఇటీవల కురిసిన వరుస వర్షాలతో పనులకు తీవ్ర ఆటంకం కలిగినా రోటరీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చెట్టుకు అవసరమైన రసాయనాలు అందించడంలో ప్రతిభ కనబరిచారు. వాతావరణం అనుకూలిస్తే వచ్చే అక్టోబర్ నాటికి పదిమంది కూర్చుని చెట్టు కింద సేదతిరే పరిస్థితి వస్తుందని రోటరీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చెట్టు మళ్లీ బ్రతకాలని కోరుకున్న ప్రతిఒక్కరికి ఇది సంతోషం కలిగిస్తున్న వార్త. వృక్షో రక్షతి రక్షితః అంటారు. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను కాపాడతాయని పెద్దలు ఎపుడో చెప్పారు కదా..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article