ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వివాహితను కాపాడి ఇద్దరు పోలీసులు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక మహిళ నిండు ప్రాణాన్ని కాపాడి, సమయానికి స్పందించి వృత్తిధర్మాన్నే కాదు.. మానవత్వాన్ని చాటుకున్న ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది.. ఆ వివరాలేంటి చూద్దాం.
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు, తరుణ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజువారీ లాగే గురువారం(ఫిబ్రవరి 6) విధుల్లో ఉండగా డయల్ 100కు ఒక సమాచారం అందింది. బాలాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడుతుందని వచ్చిన ఆ సమాచారంతో వెంటనే స్పందించారు కానిస్టేబుళ్ళు రాజు, తరుణ్. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు బిగించుకుని లోపల ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండడంతో పెద్ద కర్ర సహాయంతో మూసి ఉన్న తలుపులను బద్దలు కొట్టారు.
అప్పటికే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆ మహిళను వెంటనే రక్షించారు. చీరను కోసేసి, క్షేమంగా మహిళను కిందకు దించారు. సమయానికి అక్కడికి చేరుకుని మహిళను కాపాడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మహిళతో మాట్లాడి తన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు విషయం తెలుసుకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఘటనపై ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పందిస్తూ.. బాలాపూర్ ప్రాంతంలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుందని స్థానికుల ద్వారా సమాచారం అందిందని అన్నారు. అందుకే వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మహిళ ప్రాణాలను రక్షించడం జరిగిందని చెప్పారు. అయితే.. సమయానికి స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్థానికులు మరియు తోటి సిబ్బంది అభినందించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..