కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న సమర్పించారు. ఈ బడ్జెట్‌లో సాధారణ ప్రజలకు రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను రహితం, సీనియర్ సిటిజన్‌లకు TDSలో మినహాయింపు, అనేక వస్తువులపై కస్టమ్ డ్యూటీలో మార్పులు వంటి అనేక రకాల ప్రయోజనాలు అందించింది. దీని కారణంగా కొన్ని వస్తువులు చౌకగా మారతాయి. అలాగే కొన్ని ఖరీదైనవిగా మారనున్నాయి. ఇప్పుడు ఈ మార్పులు ఎప్పుడు అమలులోకి వస్తాయి? ప్రజలకు దాని ప్రయోజనాలు ఎప్పుడు అందుతాయి అనే ప్రశ్న తలెత్తుతుంది.
పన్ను మినహాయింపు ఎప్పుడు వర్తిస్తుంది?
మీరు పన్ను చెల్లింపుదారులు అయితే, రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందాలనుకుంటే ఏప్రిల్ 1, 2025 వరకు ఆగాల్సిందే. అప్పటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వస్తుంది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి వస్తుంది.
మీరు ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఎప్పుడు పొందుతారు?
కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. అంటే ఏప్రిల్ 1, 2025 నుండి వచ్చే మీ జీతంపై మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ మీరు 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2025 – మార్చి 2026) జూలైలో ఆదాయానికి సంబంధించిన ITRని ఫైల్ చేసినప్పుడు అది లెక్కించబడుతుంది. దీని వాపసు, ఇతర ప్రయోజనాలు అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27లో అందుబాటులో ఉంటాయి. మీరు జూలై 2025లో ఫైల్ చేసే ITR ఈ మారిన నియమం ప్రకారం లెక్కించరు. పాత నియమం ప్రకారం లెక్కిస్తారని గుర్తుంచుకోండి.
ఈ తగ్గింపును ఎవరు ఉపయోగించుకోవచ్చు?
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది. మీరు ఇప్పటికీ పాత పన్ను విధానంలో ఉన్నట్లయితే, మీరు ఈ మినహాయింపును పొందేందుకు కొత్త పన్ను విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది.
ఆర్థిక సంవత్సరం, మదింపు సంవత్సరం అంటే ఏమిటి?
- భారతదేశంలో ఆర్థిక సంవత్సరం (FY) ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది.
- ఉదాహరణ: FY 2025-26 కాల వ్యవధి 1 ఏప్రిల్ 2025 నుండి 31 మార్చి 2026 వరకు ఉంటుంది.
- అసెస్‌మెంట్ ఇయర్ (AY) అనేది గత ఆర్థిక సంవత్సరం ఆదాయంపై పన్ను దాఖలు చేసిన సంవత్సరం.
- FY 2025-26 ఆదాయపు పన్ను AY 2026-27లో దాఖలు చేయబడుతుంది.
ఇది కూడా చదవండి: Budget 2025: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు మంచి రోజులు.. బడ్జెట్‌లో గుడ్‌న్యూస్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి