ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం సెక్టార్ 19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో రెండు మూడు సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా వేదిక వద్ద ఇప్పటికే నిలిపి ఉంచిన అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖల సమన్వయంతో వెంటనే ప్రయత్నాలు ప్రారంభించి, స్వల్ప వ్యవధిలో విజయవంతంగా మంటలను ఆర్పారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, క్యాంప్ సైట్‌లో మంటలు చెలరేగాయి, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అనేక గుడారాలను మంటల్ని చుట్టుముట్టాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేసింది. అనేక గుడారాలు మంటల్లో బూడిదయ్యాయి.
చుట్టుపక్కల గుడారాల్లో నివసిస్తున్న ప్రజలను భద్రత కోసం ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ ఘటనపై పోస్ట్ చేసింది, “చాలా విచారకరం! #మహాకుంభ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిపాలన యంత్రాంగం తక్షణ సహాయ, రెస్క్యూ ఆపరేషన్‌లను అందిస్తోంది. ప్రతి ఒక్కరి భద్రత కోసం మేము గంగను ప్రార్థిస్తున్నాము” అని రొసుకొచ్చింది.
ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి అగ్నిప్రమాదానికి గురైన వారికి సహాయం అందించాలని సీనియర్ అధికారులకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..