రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో గత కొంతకాలంగా విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇంత జరగుతున్నా రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో విద్యార్ధిని గురుకుల హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది..
Gurukul School Student
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు విద్యార్ధుల పాలిట మృత్యు కుహరాల్లా మారాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గురుకుల విద్యార్ధులు పదుల సంఖ్యలో మృత్యువాత పడగా.. వందలాది మంది విద్యార్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. మౌలిక సదుపాయాల కొరత, ఫుడ్ పాయిజన్ కారణంగా అధిక మంది విద్యార్ధులు అనారోగ్యం బారీన పడుతున్నారు. మరికొంత మంది విద్యార్ధులు తాము చదువుతున్న గురుకులంలోనే ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్ కనీసం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవడం విడ్డూరం. ఈ క్రమంలో తాజాగా మరో గురుకుల విద్యార్ధిని అసువులు బాసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గురుకులంలో విద్యార్ధిని అనుమానాస్పద రీతిలో మరణించి కనిపించింది. ఈ విషాద ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గురుకుల హాస్టల్లో కల్వకుర్తికి చెందిన ఆరాధ్య బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఏం జరిగిందో తెలియదుగానీ ఆరాధ్య క్లాస్ రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6:30 గంటలకు ఆరాధ్య సీలింగుకి వేలాతూ కనిపించడంతో తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పడంతో అంతా కలిసి హుటాహుటిన షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్ధిని బంధువులు గురుకుల విద్యాసంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.