Telangana Voters From Kumuram Bheem District Create A Record By Casting Their Votes
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు జరుగుతున్న పోలింగ్లో తెలంగాణ ఓటర్లు ఓటేసి రికార్డ్ క్రియేట్ చేశారు. కొమురంభీం జిల్లా కెరమెరి మండలానికి చెందిన 3597 మంది ఓటర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఒకే ఏడాదిలో నాలుగు సార్లు ఓటేసి సత్తా చాటారు వారంతా. దేశంలో ఎక్కడున్న ఒకటే ఓటర్ ఐడి ఒకే చోట ఓటింగ్ అన్న ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పక్కన పెట్టి మహారాష్ట్రలో ఓటేశారు తెలంగాణ ఓటర్లు. ఎన్నికల సంఘం పెట్టిన ఆంక్షలు మాకు చెల్లవంటూ.. సరిహద్దు వివాదం తేలేంత వరకు రెండు రాష్ట్రాల్లోను ఓటేస్తామని ఆ 12 గ్రామాల ప్రజలు మరొసారి నిరూపించారు.
అసలు విషయంలోకి వెళితే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని 12 గ్రామాల సరిహద్దు వివాదం కథ తెలుసు కదా.. ఆ 12 గ్రామాల ప్రజలు నేడు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ ఎన్నికల్లో భారీగా పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలుగా సరిహద్దు వివాదంతో నలిగిపోతున్నామని.. ఒక వేళ ఏదోక రాష్ట్రానికి పరిమితం అయితే మాకు రావాల్సిన ఆ కనీస సంక్షేమ పథకాలు కూడా రావేమో అన్న ఆందోళనతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను ఓటేసామని తెలిపారు. పరందోలి, అంతపూర్ గ్రామపంచాయతీల పరిదిలోని 12 సరిహద్దు వివాద గ్రామాల ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, నోరేవాడ, బోలాపటార్, అంతాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో సుమారు 3,597 మంది ఓటర్లు ఉన్నారు. పరంధోళి పోలింగ్ కేంద్రం పరిధిలో పరంధోళి, తాండ, కోటా, శంకర్ లొద్ది, లేండిజాల, ముకదం గూడ గ్రామాలు, నోకేవాడ పరిధిలో మహరాజ్ గూడ, ఖోలాపటార్ పరిధిలో బోలాపటార్, గౌరి, లేండిగూడ,అంతాపూర్ పోలింగ్ కేంద్రం పరిధిలో నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్ అంతపూర్ గ్రామాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఈ 12 గ్రామాల ఓటర్లు ప్రశాంత వాతవరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు వినియోగించుకున్న ఈ 12 గ్రామాల ఓటర్లు.. ఏప్రిల్ 19న పార్లమెంటు తొలి విడత ఎన్నికల్లో మహారాష్ట్ర చంద్రపూర్ పార్లమెంటు స్థానానికి.. మే 13న నాలుగవ విడతలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ స్థానానికి నేడు పోలింగ్ కొనసాగుతుండగా.. బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో సుభాష్ బావు ధోటే( కాంగ్రెస్), దేర్రావు భోంగై(బీజేపీ), వామన్ రావు చటప్(సేత్ కారి సంఘటన్), గజానంద్ గోద్రు జుగ్నాకే(గోండ్వానా గణ తంత్ర పార్టీ) మధ్య బలమైన పోటీ ఉంటుందనిఅక్కడి ప్రజలు బావిస్తున్నారు.