దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమాపైనే ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘SSMB 29’ అని పేరు పెట్టారు. ఈక్రేజీ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని సమాచారం. అదే సమయంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ప్రియాంక చోప్రా ‘SSMB 29’ సినిమా కోసం 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారట. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ప్రియాంక చోప్రాకి ఇంత మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
మహేష్ బాబు సినిమా కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అమెరికాలోనే సెటిల్ అయింది. బాలీవుడ్ సినిమాలను అంగీకరించి చాలా రోజులైంది. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ఆమెకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది. దీంతో ప్రియాంక టాలీవుడ్ సినిమాలో నటిస్తే ఆ సినిమాకు ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుంది. అందుకే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ‘SSMB 29’ సినిమా కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతని గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
కాగా ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వీడి ఇన్నాళ్లు అవుతోంది. 2016లో విడుదలైన ‘జై గంగాజల్’ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా మరే హిందీ సినిమాలోనూ నటించలేదు. ఆ తర్వాత రెండు భారతీయ సినిమాల్లో నటించినా అవి పూర్తిగా హిందీ, బాలీవుడ్ సినిమాలు కావు. దీంతో మహేష్ సినిమాతో చాలా రోజుల తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.