నెల్లిమర్ల, జనవరి 19: మరో వైద్య విద్యా కుసుమం నేల రాలింది. ఎన్నో ఆశలతో ఎంబీబీఎస్ చదివేందుకు వచ్చిన ఆ విద్యార్ధి.. తోటి విద్యార్ధులంతా పరీక్షల్లో పాసైతే తాను మాత్రం సెకండియర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెందాడు. అంతే మానసికంగా కుంగిపోయిన ఆతడు పరుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీకి చెందిన అటుకూరి సాయి మణిదీప్ (24) అనే విద్యార్థి.. ఎంబీబీఎస్ చదువుతున్నాడు. విద్యార్థి సాయి మణిదీప్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు. కాలేజీ వసతిగృహంలోని తన గదిలో తలుపులు బిగించుకున్న సాయి మణిదీప్ ఎంతకూ తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులంతా ఆందోళన చెందారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టి చూసేసరికి సాయిమణిదీప్ అపస్మారక స్థితిలో పడి ఉండటం గుర్తించారు. వెంటనే మిమ్స్ యాజమాన్యానికి సమాచారం అందించి, ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసుకులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో సాయిమణిదీప్ రెండో ఏడాది ఎంబీబీఎస్ పరీక్ష ఫెయిల్ అయ్యాడని, దీంతో మానసికంగా ఆందోళనకు గురైనట్లు ఎస్ఐ తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అయిన తానుతప్ప తోటి విద్యార్థులంతా చదువు పూర్తి చేసి వెళ్లిపోతారని మృతుడు సాయి మణిదీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విద్యార్ధి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసధికారి ఒకరు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.