గతేడాది ఎంతో మంది సెలెబ్రిటీలు వివాహ జీవితంలోకి అడుగు పెట్టారు. వాళ్లలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట ఒకటి. దాదాపు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని గట్టిగానే ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని శోభితా ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌లు ఇచ్చింది. కానీ..ఉన్నట్టుండి నాగార్జున వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసి షాక్ ఇచ్చారు. చైతు, శోభిత నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి డేట్ చెప్తానంటూ పోస్ట్ పెట్టారు నాగ్. ఆ తరవాత డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో వీళ్లిద్దరి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది.
Naga Chaitanya And Sobhita
శోభిత ధూళిపాళతో వివాహంపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెడ్డింగ్ ప్లాన్ అంతా శోభితాదేనని చెప్పాడు. తండేల్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చైతు..రీసెంట్‌గా తన వెడ్డింగ్ ప్లాన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమ పెళ్లి అంత గొప్పగా, అందంగా జరగడానికి కారణం శోభితాయేనని అన్నాడు. ఈ విషయంలో ఆమెకే పూర్తి క్రెడిట్ ఇచ్చేస్తున్నానని భార్యని పొగిడాడు చైతు.
“పెళ్లి బాగా జరిగిందంటే..ఆ క్రెడిట్ అంతా శోభితాదే. మొత్తం తనే ప్లాన్ చేసింది. తనే డిజైన్ చేసింది. తనకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కడా రాజీపడకుండా తెలుగు నేటివిటీతో పెళ్లి జరిగేలా చూసుకుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. ఆ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని చెప్పాడు చైతు. పనిలో పనిగా వైజాగ్‌పైనా ప్రశంసలు కురిపించాడు. ఈ మధ్యే వైజాగ్‌లో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “వైజాగ్ నాకెంతో ఇష్టమైన సిటీ. నేను వైజాగ్ అమ్మాయితోనే ప్రేమలో పడ్డా. ఆమెనే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా ఇంటికి వైజాగ్ వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. మీరంతా తండేల్ సినిమాని చూసి మంచి కలెక్షన్స్ ఇవ్వండి. లేదంటే ఇంట్లో మా ఆవిడ ముందు పరువు పోతుంది” అని అందరినీ నవ్వించాడు నాగచైతన్య.
ఇక చైతు, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. నాగచైతన్య, సాయి పల్లవి ఇప్పటికే లవ్‌స్టోరీ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేస్తుండడం వల్ల తండేల్‌పై అంచనాలు పెరిగాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి