సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం అయింది. కులగణన వివరాలు సబ్ కమిటీకి వివరించింది కమిషన్. బీసీ కోటాపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. కులగణన సర్వేలో 55.85 శాతంగా బీసీలు ఉన్నాట్లు తేల్చారు. కొత్త లెక్కల ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. బీసీలకు 40 శాతం కోటా పెంచుతామని ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని అన్నారు. మొత్తం 50 రోజుల పాటు కులగణన సర్వే నిర్వహించారు. సర్వేలో లక్షా 3,889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9శాతం కుటుంబాలను సర్వే చేశారు అధికారులు. సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివారాలను వెల్లడించారు. 3.1శాతం సర్వేలో పాల్గొనలేదని కమిషన్ రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. సభలో కులగణన నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నివేదికపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలపనుంది.
సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కులగణన చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీ గైడెన్స్ మేరకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిపోర్టు ద్వారా అత్యంత వెనకబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.