మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనేది టీడీపీ నేతల మన్ కీ బాత్. దీనిపై సొంత పార్టీ నేతల కామెంట్స్, ఇతర పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్స్‌తో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దంటూ నేతలకు సూచించింది. దీంతో ఈ ఎపిసోడ్‌కి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా?
Minister Nara Lokesh
ఏపీ సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలకు అనేక మంది టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్టు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ. అటు లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం కూడా కావాలనేది తన కోరికని అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సీఎం పదవి పవన్‌కు ఇచ్చినా స్వాగతిస్తానని తెలిపారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కూటమి పెద్దలు నిర్ణయిస్తారు. వైసీపీ నేతలు కూటమిలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి వస్తుందా.. లేదా.. అనేది అంతా దైవేచ్చ అన్నారు హోం మంత్రి అనిత. నుదుటి మీద రాసిపెట్టింది ఎవరూ తీయలేరన్నారు.
టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదు, కానీ.. పవన్‌ను సీఎంగా చూడాలని పదేళ్లుగా జసేనన కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. కోరికలు అందరికీ ఉంటాయి. కానీ కూటమిలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి వేరే పార్టీకి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదన్నారు. మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం కాదు.. కంట్రోల్ చేయాలని అమిత్‌షా చెప్పారని ఆరోపించారు. అయితే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దని హెచ్చరించింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది. కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలుంటాయని ప్రకటించింది. దీంతో ఏపీ రాజకీయాల్లో మొదలైన ఈ ప్రచారానికి తెరదించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి