బ్రెజిలియా, ఫిబ్రవరి 4: ఆవు మహా అయితే పొలం దున్నడానికి, పాలివ్వడానికి మినహా దేనికి పనికొస్తాయిలే అని అందరూ అనుకుంటారు. కానీ ఓ ఆవు ఏకంగా కాసుల పంట పండించింది. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అక్కడ జరిపిన వేలం పాటలో ఏకంగా 4.8 మిలియన్ డాలర్లు (అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి అందరినీ ఆశ్చర్చపరిచింది. భారత్‌కి చెందిన నెల్లూరు ఆవు విదేశాల్లో అధిక ధర పలికి సరికొత్త రికార్డు సృష్టించింది.
శ్రేష్ఠమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులు సాధారణంగానే ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు రూ.40 కోట్లకు అమ్ముడుపోయింఇ. ఈ ఆవు సుమారు 1,101 కిలోల బరువుంది. సాధారణంగా ఈ జాతికి చెందిన ఆవుల కంటే కూడా దీని బరువు రెట్టింపు ఉండటం గమనార్హం. దీంతో వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. గతంలోనూ దీని కండరాల నిర్మాణం, అరుదైన జన్యువులు కారణంగా ‘ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’గా బహుమతులు గెలుపొందింది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. పశు సంపద పెంచేందుకు వియాటినా-19 ద్వారా అండాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు.
వియాటినా-19 అనే నెల్లూరు జాతి ఆవులు.. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవి. ఈ జాతిని 1800లలో బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడి పశువుల పెంపకం రంగంలో ఈ జాతి ఆవులు బాగా ప్రాచుర్యం పొందాయి. నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు ముఖ్యాధారంగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ జాతి ఆవులు శరీర సౌష్టవం, వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. ఈ కారంణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం, పాడి ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్.. వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. వియాటినా 19ను పుట్టించడానికి ‘మూ-జెనిక్స్’ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో సరోగేట్ ఆవులలో ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ప్రీ-ఓవమ్ అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ ఆవు అండాలు భారత్‌లోకి రావడం వల్ల కొత్త జాతితో పశు సంపదను బలోపేతం చేయవచ్చు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.