తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రామసభల్లో దరఖాస్తు చేయని వాళ్లంతా మీ సేవా కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రేషన్ కార్డుల కలిగి.. కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామాలో మార్పులు, చేర్పులకి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ప్రజాపాలన సదస్సులు.. ఈ మధ్య గ్రామ, వార్డు సభల్లో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ ప్రజాభవన్‌తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులొచ్చాయి. లేటెస్ట్‌గా మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్లు స్వీకరించాలని.. డూప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌర సరఫరాల శాఖ భావించింది. మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.
దీంతో చాలామంది రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. అయితే వారిలో కొంతమందికి నిరాశ మిగిలింది. అప్లికేషన్లు స్వీకరించడం లేదని.. ఇంకా రేషన్ కార్డుల పోర్టల్ ఓపెన్ కాలేదన్న సమాధానం వచ్చింది. మరికొందరు మాత్రం వేర్వేరుచోట్ల అప్లయ్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకోవడం గగనమే అంటూ చాలా మంది దరఖాస్తుదారులు నిట్టూరుస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..