కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పాత పన్ను విధానాన్ని ప్రస్తావించలేదు. అలాగే విడుదల చేసిన బడ్జెట్ పత్రంలో కూడా దాని గురించి పేర్కొనలేదు. అయితే సవరించిన పన్ను శ్లాబులు కొత్త విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. పాత పన్ను విధానం పన్ను చెల్లింపుదారులు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), జీవిత బీమా ప్రీమియంలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), వైద్య బీమా వంటి వాటికి మినహాయింపులు, తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ మినహాయింపులు, తగ్గింపులను వర్తింపజేసిన తర్వాత పన్ను విధించదగిన ఆదాయం లెక్కిస్తారు. ఈ లెక్కింపు కూడా నిర్దిష్ట స్లాబ్‌ల ప్రకారం ఉంటుంది. రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు. అలాగే రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం పన్ను వర్తిస్తుంది, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఆదాయానికి అనగుణంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో అన్ని పన్ను మినహాయింపులను దశలవారీగా రద్దు చేయడమే దీర్ఘకాలిక లక్ష్యమని ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అయినప్పటికీ చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత పాలనకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత సంవత్సరాల్లో తగ్గింపులను క్లెయిమ్ చేశారు. ఇప్పుడు కొత్త పాలన డిఫాల్ట్‌గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత సిస్టమ్‌లో ఉండాలనుకుంటే దానిని కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 2024లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులలో 72 శాతం మంది కొత్త విధానాన్ని ఎంచుకున్నారని మిగిలిన వారు పాత విధానాన్నే ఇష్టపడుతున్నారని ప్రభుత్వం నివేదించింది. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త ప్రయోజనాలు మరింత మంది వ్యక్తులు మారడానికి ప్రోత్సహించవచ్చు.
కొత్త పన్ను విధానాన్ని తెచ్చాక కేంద్ర ప్రభుత్వం క్రమంగా పాత పన్ను విధానంపై శీతకన్ను వేస్తుంది. కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నందున పాత వ్యవస్థను దశలవారీగా తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే అది పన్ను మినహాయింపులతో ముడిపడి ఉన్న చిన్న పెట్టుబడి పథకాలకు ప్రోత్సాహకాలను మారుస్తుందని అంచనా వేస్తున్నారు. పాత పాలనను తొలగించాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ, బడ్జెట్ 2025 కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చే దిశగా స్పష్టమైన మార్పును సూచిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలపై తదుపరి కొన్ని వారాల్లో మరింత స్పష్టత రావచ్చని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి